కొండెక్కని బస్సులు
● తరచూ మొరాయిస్తున్న ఆర్టీసీ సర్వీసులు
● ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
సాక్షి,పాడేరు: విశాఖ నుంచి పాడేరు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఘాట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం విశాఖ నుంచి పాడేరు బయలుదేరిన విశాఖపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సాంకేతిక సమస్యతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఘాట్‌లో నిలిచిపోయింది. దీనిలో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వీరంతా బస్ దిగి మరో ఆర్టీసీ బస్సు, ఇతర వాహనాల కోసం నిరీక్షించారు. పండగ పూట ఆకలితో అలమటించారు. ఇదే మార్గంలో వచ్చిన ఆర్టీసీ బస్సులో వారిని ఎక్కించి పంపించారు. పాడేరు, విశాఖపట్నం డిపోల పరిధిలో బస్సులు చాలావరకు పాతవి కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఘాట్ ప్రాంతాల్లో బస్ సర్వీసులన్నీ కండిషన్‌లో ఉండాలన్న నిబంధనలకు ఆర్టీసీ యాజమాన్యం తిలోదకాలు ఇస్తోందని పలువురు ప్రయాణికులు విమర్శిస్తున్నారు.


