గంజాయి కేసులో నిందితుల అరెస్ట్, రిమాండ్
పెందుర్తి: ఒడిశా నుంచి నాసిక్‌కు రూ.10 లక్షల విలువైన 180 కిలోల గంజాయిని తరలిస్తూ పోలీసులకు సోమవారం చిక్కిన కేసులో ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వెస్ట్ జోన్ ఏసీపీ ఏబీ పృధ్వీతేజ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ తెలిపిన వివరాలు..
ముంచంగిపుట్‌కు చెందిన బిసోయి సహదేవ్, కొర్ర సన్యాసిరావు, మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన అజయ్ సామ్ చావన్, అంకిత్ జోషి, శ్రీనివాస్ వాగ్, ఒడిశాకు చెందిన ప్రేమ్‌కుమార్, దావుద్‌ఖాన్ ఓ ముఠా. వీరిలో దావుద్‌ఖాన్, శ్రీనివాస్ వాగ్ ప్రధాన సూత్రదారులు. వీరు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఒడిశా ప్రాంతాల్లోని గంజాయిని సేకరించి దేశంలోని అన్ని ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఫోర్స్ మినీ టెంపో ట్రావెలర్‌లో 180 కిలోల గంజాయిని ఒడిశా నుంచి అరకు మీదుగా నాసిక్‌కు తరలించేందుకు విశాఖ నగరం వైపు వెళుతున్నారు. వ్యాన్‌కు ముందు రెండు బైక్‌లు ఎస్కార్ట్‌గా ఉన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్, పెందుర్తి పోలీసులు సీఐ కె.వి.సతీష్‌కుమార్ సారథ్యంలో పెందుర్తి మండలం రాజయ్యపేట సమీపంలో కాపు కాశారు. మినీ వ్యాన్‌ను అడ్డుకుని అందులో పరిశీలించగా గంజాయి పట్టుబడింది. ఐదుగురు నిందితులు సహదేవ్, సన్యాసిరావు, అజయ్, అంకిత్, ప్రేమ్‌కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఏసీపీ వెల్లడించారు. వారి నుంచి గంజాయి, మినీ టెంపోతో పాటు రెండు బైక్‌లు, రూ.10 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐ కె.వి.సతీష్‌కుమార్, ఎస్‌ఐ స్వామినాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన
మరో ఇద్దరి కోసం గాలింపు
మీడియాతో వెస్ట్‌జోన్ ఏసీపీ పృధ్వీతేజ


