
కమనీయం.. కల్యాణోత్సవం
అల్లిపురం (విశాఖ) : బల్లిగిరి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి తిరు కల్యాణోత్సవాలు గురువారంతో ముగిసాయి. ఈనెల 18వ తేదీన స్వామి వారి తిరు కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీన స్వామి వారి తిరు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఉదయం అష్టోత్తర శత కలశస్నపనం, తిరుమంజనసేవ, వసంతోత్సవం, చక్రతీర్థం నిర్వహించారు. ఆలయ అర్చకుడు గొడవర్తి వీరరాఘవాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ మండపంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కలశాలలో నింపిన పాలు, పెరుగు, గంధం, పసుపు నీటితో శ్రీచక్రంతో పాటు ఉత్సవ విగ్రహాలకు పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, అభిషేకం నిర్వహించారు. ముందుగా పూర్ణాహుతి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కల్యాణోత్సవాల ముగింపు సందర్భంగా స్వామి వారికి భక్తి శ్రద్ధలతో చక్రస్నానం చేశారు. సాయంత్రం ధ్వజావరోహణం చేపట్టారు. ఈ సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణంతో బల్లిగిరి మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, నక్షత్ర హారతి, సప్త హారతులు నిర్వహించారు.
నేడు పుష్పయాగం..
కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం పుష్పయాగం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో జీవీ రమాబాయ్ తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి ఊంజల్ సేవ అత్యంత వైభవంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పాల్గొని తరించాలని ఆమె కోరారు.
బల్లిగిరిలో ముగిసిన ఉత్సవాలు
వైభవంగా సహస్ర ఘటాభిషేకం, చక్రస్నానం
భక్తిశ్రద్ధలతో పూర్ణాహుతి