ప్రైవేట్‌లో క్వింటాలుకు రూ.8వేలకు అటుఇటుగా
ఇప్పటికే పంట అమ్మిన 80శాతానికి పైగా రైతులు
కొంత మంది మాత్రమే నిల్వ
మరింత పెరుగుతుందనే అంచనాలు
విక్రయించిన వారి వేదన.. మిగతా వారు ఎదురుచూపు
సాక్షి,ఆదిలాబాద్: ప్రస్తుతం సోయాబీన్ ధర బహిరంగ మార్కెట్లో రూ.8వేలకు అటు ఇటుగా కొనసాగుతుంది. రెండు రోజుల క్రితం రూ.8వేల మార్కు దాటినప్పటికీ ప్రస్తుతం కొంత తగ్గింది. మరోవైపు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర మాత్రం క్వింటాలుకు రూ.5,708. దిగుబడులు చేతికొచ్చిన సమయంలో నెలన్నర క్రితం కూడా మద్దతు ధర మించి ప్రైవేట్‌లో రూ.6,800 నుంచి రూ.7వేలకు పైగా పలికింది. రైతులు అప్పటినుంచే పంటను అమ్ముతూ వచ్చారు. ఈసారి ధర భారీగా పెరుగుతుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ, రైతు ఆర్థిక పరిస్థితులతో విక్రయించక తప్పలేదు. జిల్లాలో ఇప్పటికే 80 శాతానికి పైగా విక్రయించేశారు.
ఇదీ పరిస్థితి..
వానాకాలంలో పత్తి పంట తర్వాత జిల్లాలో సోయా అత్యధికంగా సాగైంది. సాధారణంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినప్పటికీ వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన స్థాయిలో రాలేదు. నీటి వసతి ఉన్న రైతులకు ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు, వర్షాధారంగా పండించిన వారికి 4 నుంచి 6 క్వింటాళ్ల లోపే దిగుబడులు వచ్చాయి. పంట చేతికొచ్చిన సమయంలోనే మద్దతుకు మించి మార్కెట్లో ధర ఉండడంతో రైతులు అప్పటి నుంచే విక్రయించుకుంటూ వచ్చారు. ప్రైవేట్ వ్యాపారులు కల్లాలు, ఇళ్ల వద్దకే వచ్చి నేరుగా కొనుగోళ్లు చేశారు. తేమ ఆధారంగా ధరలో కోత పెట్టి డబ్బులు అందజేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో రైతు మార్కెట్‌ను అంచనా వేయలేకపోయాడు. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో సోయాకు భారీగా ధర పెరుగుతుండడంతో పంటను విక్రయించిన రైతులు వేదన చెందుతుండగా, నిల్వ ఉంచిన కొంత మంది మాత్రం ఇంకా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ప్రైవేట్‌లోనే విక్రయాలు..
ఈసారి మొదటి నుంచి సోయాకు మద్దతు ధర మించి బహిరంగ మార్కెట్లో రేటు ఉండడంతో ప్రైవేట్ వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. కొన్ని మార్కెట్లలో క్వింటాలుకు రూ.8,061 వరకు పలుకుతుంది.
– మహేశ్‌కుమార్, డీఎం, మార్క్‌ఫెడ్, ఆదిలాబాద్


