అటవీ అనుమతుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అటవీ అనుమతుల సమస్యలు పరిష్కరించాలి

Nov 26 2026 12:06 AM | Updated on Nov 26 2026 12:06 AM

● కలెక్టర్‌ రాజర్షిషా

ఆదిలాబాద్‌టౌన్‌: ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అటవీశాఖ అనుమతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీవీటీజీ కోర్‌ ప్రాంతాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉన్న ఇళ్లకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద లబ్ధిదారులకు గృహ నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీ గ్రామాల్లో జీపీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సంఘాల భవనాల నిర్మాణాలకు సంబంధించి ఎదురవుతున్న అటవీశాఖ అనుమతుల సమస్యలపై చర్చించారు. గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, హౌసింగ్‌, విద్యుత్‌ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న క్లియరెన్స్‌లను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ మంద మకరంద్‌, అటవీ శాఖ అధికారి సుశాంత్‌ సుఖదేవ్‌ బొబాడే, హౌసింగ్‌ పీడీ శంకర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

జిల్లా కేంద్రంలోని నీలానగర్‌లో ఇందిరమ్మ పథకం లబ్ధిదారుడు పస్పుల రాజు నిర్మించుకున్న నూతన గృహాన్ని కలెక్టర్‌ బుధవారం ప్రారంభించారు. ఇందులో మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్‌గౌడ్‌, హౌసింగ్‌ ఈఈ నాసిర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

రజకుల అభ్యున్నతికి ప్రాధాన్యం

ఆదిలాబాద్‌రూరల్‌: రజకుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని కలెక్టర్‌ రాజర్షిషా అన్నా రు. ఆదిలాబాద్‌ పట్టణంలోని దస్నాపూర్‌ ధోబీ కా లనీలో అంజనీపుత్ర కోఆపరేటివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధునిక యంత్రీకృత ధోబీ ఘాట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఆధునిక సదుపాయాలను సద్విని యోగం చేసుకుని, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇందులో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి సోనియా, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీష్‌గౌడ్‌, వార్డు కౌన్సిలర్‌ యోగేష్‌, సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, కార్యవర్గ సభ్యులు, రజక సంఘం నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత

ఆదిలాబాద్‌టౌన్‌: మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డీఆర్‌డీఏ–సెర్ప్‌ పథకాల అమలు, పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ ద్వారా ఇప్పటివరకు రూ.93,700 నికర లాభం రావడం అభినందనీయమన్నారు. ఆదిలాబాద్‌ మహిళా మార్ట్‌లో సరుకుల కొరత లేకుండా పక్కా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, బయటి ఉత్పత్తులను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇంద్రవెల్లి, భీంపూర్‌, నార్నూర్‌, ఉట్నూర్‌, నేరడిగొండ మండలాల్లో మునగ సాగును విస్తరించి, ఆకుపొడి తయారీ యూనిట్ల ద్వారా మహిళలు, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు అనుబంధంగా జీవనోపాధి యూనిట్ల ఏర్పాటు, గుడిహత్నూర్‌ మండలం ధర్ముగూడలో మోదుగు ఆకు విస్తర్ల తయారీ, నార్నూర్‌లో మహువా లడ్డూ తయారీ యూనిట్‌ పనితీరును సమీక్షించారు. ఇందులో డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, ఉద్యానవన శాఖ అధికారి సందీప్‌ కుమార్‌, ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌, ఏపీఎంలు, డీపీఎంలు, సీసీలు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement