ఆదిలాబాద్‌టౌన్: కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేసిన ఔట్సోర్సింగ్ కార్మికులపై ఏజెన్సీలు కొరడా ఝళిపించాయి. నియామక సమయంలో కేటాయించిన విధులు కాకుండా కొందరు ఇతర పనుల్లో కొనసాగుతున్నారు. ఇటీవల రిమ్స్ వరుస ఘటనల నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షా గత నెలలో ఆసుపత్రిలో వైద్యులు, అధికారులు, ఏజెన్సీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎవరికి కేటాయించిన విధుల్లో వారే పనులు నిర్వహించాలని డైరెక్టర్‌తో పాటు ఏజెన్సీలను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పలుమార్లు ఆయా ఏజెన్సీలు నచ్చజెప్పినా వినకుండా కొందరు వారికి అనుకూలంగా ఉన్న పోస్టుల్లో కొనసాగుతున్నారు. వేతనంలో కోత విధిస్తామని చెప్పినప్పటికి పెడచెవిన పెట్టారు. రెండు సార్లు నోటీసులు అందజేసినా స్పందించకపోవడంతో 26 మంది కార్మికులను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ ఏజెన్సీలను ఆదేశించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు తొలగించిన వారికి ఆ సమాచారాన్ని అందజేశారు. ఈ పోస్టుల్లో పనిచేయడం ఇష్టం లేకుంటే వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కలెక్టర్ ఏజెన్సీలకు సూచించారు. పేషెంట్‌కేర్, స్వీపర్ పోస్టుల్లో పనిచేయడం ఇష్టం లేకపోతే కొత్తవారిని నియమించేందుకు నిర్ణయం తీసుకోవాలని సూచించడంతో ఈ చర్యలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా వీరు ఓపీ చీటిలివ్వడం, హెచ్‌వోడీల వద్ద డ్యూటీలు, ల్యాబ్‌లు, ఆపరేషన్ థియేటర్లలో పనులు చేస్తున్నారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు, పేషేంట్కేర్లు సరిపోకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. వారి తీరు మార్చుకోకపోవడంతోనే ఈ చర్యలకు పూనుకున్నట్లుగా ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు.


