ఆదిలాబాద్‌టౌన్: టెక్నీషియన్ల ముసుగులో వెంటిలేటర్ల చోరీ చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి వెంటిలేటర్లతోపాటు వైద్యపరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో శనివారం వివరాలు వెల్లడించారు. నిందితులు మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన సజ్జన్ బసంత్ మోతే, హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌కు చెందిన మేడం కొండారెడ్డిలను అరెస్ట్ చేయగా, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన అభిజిత్ పరారీలో ఉన్నారు. గతనెల 30న సజ్జన్ బాసన్ మోతే, అభిజిత్ టెక్నీషియన్లుగా ఆదిలాబాద్ రిమ్స్‌లో ప్రవేశించారు. రెండో అంతస్తులో ఆర్‌ఐసీయూ, సారీ వార్డుల్లో రోగులకు అత్యవసర చికిత్స అందించే రూ.32 లక్షల విలువ గల నాలుగు వెంటిలేటర్లను చోరీ చేసి మహారాష్ట్రకు తరలించారు. వీటిని విక్రయించేందుకు హైదరాబాద్‌కు చెందిన మెడికల్ ఎక్విప్మెంట్ సేల్స్ అండ్ సర్వీస్ వ్యాపారి కొండారెడ్డిని సంప్రదించారు. చోరీ వస్తువులని తెలిసి కొనుగోలు చేయడానికి చంద్రపూర్‌కు వచ్చాడు. వైద్య పరికరాలను కారులో పెట్టుకుని హైదరాబాద్‌కు వెళ్తుండగా, ఆదిలాబాద్ ఆర్టీవో కార్యాలయం సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీల్లో గుర్తించి పట్టుకున్నారు. నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులో తీసుకున్నారు. వీరు గతంలో మహారాష్ట్రలోని చంద్రపూర్ వద్ద గల నాగ్భీడ్, వణి, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోరీ చేసి ఒక వెంటిలేటర్, ఎన్‌ఎస్‌టీ మిషన్, ఫీటల్ మానిటర్, డయాథెరపీ మిషన్‌తోపాటు నగదు, రూ.లక్ష నగదు, సెల్‌ఫోన్లు, ఒక బైకు, కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, టూటౌన్ సీఐ కె.నాగరాజు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై అఖిల్, ఆర్‌ఎస్సై గోపికృష్ణ, సిబ్బంది, హెచ్‌సీ రమణ, క్రాంతి, త్రిశూల్, అఖిల్, నరేశ్ పాల్గొన్నారు.


