బాసర: ప్రముఖ సనాతన ధర్మ ప్రచారకులు, ఆధ్యాత్మిక ప్రసంగకర్త, వేద పండితుడు బ్రహ్మశ్రీ పసలపూడి శ్రీనివాస బంగారయ్య శర్మ శుక్రవారం బాసర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. వేకువజామునే ఆలయానికి చేరుకున్న ఆయన శ్రీజ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్ల అభిషేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజలు, అర్చనల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకుముందు క్షేత్రానికి వచ్చిన శర్మకు వ్యాసపురి సంక్షేమ సంఘం వైదిక బృందం పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికింది. ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి బాలాలయంలో శర్మకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో సన్మానించారు.
ఆగమ శాస్త్రం ప్రకారమే పునర్నిర్మాణం
కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠం సూచనల మే రకు అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు సాగడం హర్షణీయమని బ్రహ్మశ్రీ పసలపూడి శ్రీనివాస బంగారయ్య శర్మ పేర్కొన్నారు. శ్రీ శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారి దివ్య అనుగ్రహం, సూచనలతో.. ఆగమ శాస్త్ర నిబంధనలకు కచ్చితంగా లోబడి ఈ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడం అ భినందనీయమని కొనియాడారు. ఆలయ పవిత్రత దెబ్బతినకుండా పనులు చేపట్టడం గొప్ప విషయమని తెలిపారు. ఉభయ జగద్గురువుల ఆశీస్సులతో, బ్రహ్మశ్రీ తంగిరాల సీతారామశాస్త్రి ఆధ్వర్యంలో దేవస్థాన వైదిక బృందం ఈ పనులను నడిపించడం, దీనికి రాష్ట్ర ప్రభుత్వం, దాతలు పూర్తి సహకారం అందించడం ప్రశంసనీయమని శర్మ పేర్కొన్నారు. వైదిక ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.


