బాసర: రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం బాసరలోని సరస్వతీ అమ్మవారి ఆలయ ఈవో కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పుష్కర ఘాట్ల మరమ్మతులు, నూతన ఘాట్ల నిర్మాణం, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పిండ ప్రదాన ప్రాంతాల ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం, భక్తుల పార్కింగ్, వీఐపీ పార్కింగ్ తదితర పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సరస్వతీ అమ్మవారి ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్.. పనుల్లో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని, నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ సుభాష్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.


