కై లాస్‌నగర్: బల్దియా పరిధిలోని పలు కాలనీల్లో తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. మిషన్ భగీరథ నీరందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ట్యాంకరే నీరే ఆధారమవుతోంది. అది కూడా రోజు విడిచి రోజు సరఫరా చేస్తుండడంతో సరిపోని పరిస్థితి. అలాగే పట్టణ పరిధిలో పైపులైన్ల లీకేజీలూ సమస్యగా మారాయి. దీంతో లక్షల లీటర్ల నీరు వృథాగా పోతున్న పరిస్థితి.
అడుగడుగునా లీకేజీలే ..
పట్టణ ప్రజలకు సురక్షితమైన శుద్ధజలం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ, మున్సిపల్ అంతర్గత పైపులైన్లకు తరుచూగా లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఎప్పటికప్పుడు గుర్తించి మరమ్మతులు చేసి నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాల్సిన బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మున్సిపల్ పరిధిలో 49 వార్డులుండగా నిత్యం ఏదో ఒక వార్డులో లీకేజీలు ఏర్పడుతున్నాయి. అమృత్–2లో భాగంగా ఇటీవల పలువార్డుల్లో కొత్తగా పైపులైన్లు ఏర్పాటు చేసినా ఇంకా పూర్తిస్థాయిలో కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో పాత పైపులైన్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. ఫలితంగా సరఫరాలో ఒత్తిడి పెరగడం వంటి కారణాలతో తరచూ లీకేజీ సమస్యలు ఏర్పడుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఏకంగా 96 లీకేజీలు ఉన్నట్లుగా బల్దియా అధికా రులు అధికారికంగా గుర్తించడం పరిస్థితికి అద్దం పడుతుంది.
ఎనిమిది ప్రత్యేక బృందాలు ఉన్నా ..
పైపులైన్ల లీకేజీలు అరికట్టేందుకు పట్టణ పరిధిలో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు కార్మికులతో పాటు పర్యవేక్షణకు మరో ఇద్దరిని కేటాయించారు. అయినప్పటికీ లీకేజీల సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం గమనార్హం.


