ప్రైవేట్‌లో దోపిడీ! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌లో దోపిడీ!

Nov 3 2026 12:57 AM | Updated on Nov 3 2026 12:57 AM

● నిబంధనలు పాటించని ఆస్పత్రులు ● అవసరం లేకున్నా వివిధ రకాల పరీక్షలు ● రోగుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు ● నియంత్రించడంలో అధికారులు విఫలం

జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షల పేరిట అడ్డగోలు దోపిడీపై ఆదిలాబాద్‌కు చెందిన పలువురు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సాధారణ జ్వరానికి వెళ్లినా టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులు వైద్యం పేరిట రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అవసరం లేని పరీక్షలు నిర్వహించడం, మందుల కొనుగోళ్లు, ఇతర వైద్యఖర్చుల పేరిట రోగులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ జ్వరంతో వెళ్లినా ప్రజలు బిల్లులు చూ సి మరింత ఆందోళనకు గురవుతున్నారు. రిమ్స్‌లో పనిచేసే ఎక్కువ మంది వైద్యులకు ప్రైవేట్‌ క్లినిక్‌లు ఉన్నాయి. చాలా మంది రోజూ కేవలం మూడు గంటలే విధులు నిర్వహించి తమ క్లినిక్‌లో మాత్రం రాత్రి వరకు సేవలందిస్తున్నారు. రిమ్స్‌లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గత్యంతరం లేక రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి.

పరీక్షల పేరుతో ఆర్థిక భారం..

ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లిన రోగులందరికీ దాదాపు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయాలని చెప్పడం సర్వసాధారణంగా మారింది. కొన్ని సందర్భాల్లో అవసరానికి మించి పరీక్షలు చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఒక్కో పరీక్షకు వేర్వేరు ధరలు వసూలు చేస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. తీరా రిపోర్టులో నార్మల్‌ అని చెప్పడంతో విస్మయానికి గురవుతున్నారు. అయితే ల్యాబ్‌లలో ఏ పరీక్షకు ఎంత ధర అనేది బోర్డు లేకపోవడంతో ఇష్టారీతిన దండుకుంటున్నారు. కాగా, ఇక్కడ దాదాపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వారే ఉండటం గమనార్హం.

మందుల మాయాజాలం..

జిల్లా కేంద్రంలో చాలా ప్రైవేట్‌ ఆస్పత్రులు మెడికల్‌ నిర్వాహకుల ద్వారానే కొనసాగుతున్నాయి. రిమ్స్‌తో పాటు ఇతర వైద్యులను ఏర్పాటు చేసుకొని దందా సాగిస్తున్నారు. మెడికల్‌, ల్యాబ్‌ల ద్వారా వచ్చి న ఆదాయంతోనే నిర్వహణ సాగుతోంది. డాక్టర్‌ వేతనం, కమీషన్‌, భవనం అద్దె, సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చులు మందుల ద్వారానే తీస్తున్నారంటే దోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రూ.వంద లోపు ఉండే టాబ్లెట్‌ షీట్‌కు రూ.500 నుంచి రూ.600 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మందులు ఇతర మెడికల్‌ షాపుల్లో లభించకపోవడంతో గత్యంతరం లేక రోగులు అక్కడే కొనుగోలు చేయాల్సిన దుస్థితి.

ఆదాయంపైనే దృష్టి

రిమ్స్‌లో పనిచేస్తున్న సగానికి మించి డాక్టర్లకు ప్రైవే ట్‌ క్లినిక్‌లు ఉన్నాయి. కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేసే వారు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌చేయమని ఒప్పందంతో విధు ల్లో చేరి ఆ తర్వాత తమ పని కానిచ్చేస్తున్నారు. ఉద యం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలో ఉండాల్సి ఉండగా, చాలామంది 10 గంటల తర్వాత వచ్చి మధ్యాహ్నం ఒంటిగంటకే పోతున్నా రు. రూ.లక్షల్లో వేతనం తీసుకుంటూ విధులు సక్రమంగా నిర్వహించడం లేదనే ఆరోపణలున్నాయి.

పర్యవేక్షణ కరువు..

జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో వసూలు చేస్తున్న ఫీజులు, పరీక్షల ధరలు, మందుల విక్రయాలపై సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

కమిటీ ద్వారా తనిఖీలు..

ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లను తనిఖీలు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేశాం. జిల్లాలోని అన్ని ల్యాబ్‌లు, ఆస్పత్రులను పరిశీలిస్తాం. పరీక్షలకు ఎంత డబ్బులు వసూలు చేయాలి, ఎంత వసూలు చేస్తున్నారనే వివరాలు సేకరించి తగు చర్యలు చేపడతాం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు చేపడతాం.

– డాక్టర్‌ సాధన, డీఎంహెచ్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement