బాసర: రైలులోని జనరల్ బోగీ నుంచి కిందపడి ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం సాయంత్రం బాసర రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఉమ్రి గ్రామానికి చెందిన బాలాజీ రాథోడ్ నిజామాబాద్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం దేవగిరి ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా, బాసర రైల్వే స్టేషన్ పరిధిలోని నాయగాం గేటు వద్దకు రాగానే జనరల్ బోగీలోంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో యువకుడి కాలుకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా బాధితుడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాసర ఎస్హెచ్వో సీఐ దీపక్, రైల్వే పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


