సాత్నాల: పొలంలో గడ్డి కోస్తుండగా పాము కాటుకు గురై పాలెపు సంటెన్న (65) అనే రైతు మృతి చెందిన ఘటన భోరజ్ మండలం కోరట గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అక్టోబర్ 29వ తేదీన పొలంలో గడ్డి కోస్తుండగా సంటెన్నకు ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. చుట్టుపక్కల ఏమి కనిపించలేదు. దీంతో ముల్లుగా భావించి మామూలుగా తీసుకున్నాడు. మరుసటి రోజు కాలు వాపు రావడంతో కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. సంటెన్న కుమారులు ఇద్దరు గతంలోనే మృతి చెందగా, భార్య టీబీ వ్యాధితో బాధపడుతోంది. దీంతో తమ వద్ద ఉంటున్న మనుమళ్లు పెద్దదిక్కు కోల్పోయారు. మృతుడి భార్య పాలెపు దేవ్బాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్సై స్వామి తెలిపారు.


