ఇంద్రవెల్లి: మండలంలోని హర్కపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు, ఎస్సై సాయన్న తెలిపారు. వారి వివరాల ప్రకారం.. మండలంలోని డొంగర్‌గామ్ గ్రామానికి చెందిన పెందోర్ రాము, లక్ష్మీబాయి దంపతుల కుమారుడు పెందోర్ భుమేశ్(24) ఈ నెల 30న టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాంచజన్య సభకు గ్రామస్తులతో కలిసి ఆటోలో వచ్చాడు. తిరిగి ఇంటికెళ్తుండగా ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. హర్కపూర్ సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ అతడిని తాకగా కింద పడడంతో తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం రాత్రి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం రిమ్స్‌ను సందర్శించి పంచనామా నిర్వహించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


