వ్యక్తి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అదృశ్యం

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

భైంసారూరల్‌: మండలంలోని పేండ్‌పెల్లి గ్రామానికి చెందిన 48 ఏళ్ల రాజేశ్‌గౌడ్‌ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్‌గౌడ్‌ ఈనెల 27న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అతని ఆచూకీ కోసం కుటుంబీకులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో శనివారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

స్కూల్‌ విద్యార్థి..

ఖానాపూర్‌: పట్టణంలోని ఏసీఈ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతూ, విశ్వశాంతి హాస్టల్‌లో ఉంటున్న రాథోడ్‌ అభినాయక్‌ (17) అనే విద్యార్థి నాలుగు రోజులుగా అదృశ్యమయ్యాడు. కడెం మండలం గంగాపూర్‌ గ్రామానికి చెందిన అభినాయక్‌ దసరా సెలవుల అనంతరం మంగళవారం సాయంత్రం పాఠశాలకు వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. తండ్రి రాథోడ్‌ ప్రవీణ్‌కుమార్‌ గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌ తెలిపారు.

అడవి పందులు అడ్డురావడంతో ప్రమాదం

దస్తురాబాద్‌: రోడ్డు ప్రమాదంలో ఒకరు గా యడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండలంలోని దేవునిగూడెం గ్రామానికి చెందిన ప్రోద్దుటూరి శ్రీధర్‌రెడ్డి పని నిమిత్తం శనివారం రాత్రి మండల కేంద్రానికి స్కూటీపై వెళ్లి వస్తుండగా రహదారిపై అడవి పందులు అడ్డు రావడంతో వాటిని తప్పించే క్రమంలో కింద పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వెంటనే 108లో ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రౌడీ షీటర్‌ అరెస్ట్‌

ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని బంగారిగూడ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ షేక్‌ సలీమ్‌ను అరెస్ట్‌ చేసినట్లు శనివారం ఎస్సై విష్ణువర్ధన్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. షేక్‌ సలీమ్‌ ఏఐ అప్లికేషన్‌ ద్వారా ఏకే –47 ఆయుధం పట్టుకున్నట్లు భయానకంగా ఉండే ఫొటోను వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడు. విలాసవంతమైన జీవితం గడపడం కోసం, రియల్‌ ఎస్టేట్‌ సెటిల్మెంట్‌ల పేరుతో సాధారణ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు, ప్రజలలో భయాన్ని, భీతిని సృష్టించాలనే దురుద్దేశంతో పెట్టుకున్న ఫొటో వైరల్‌ కావడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

జిల్లా బీసీ సంఘం

పరిశీలకుడిగా నర్సాగౌడ్‌

నిర్మల్‌టౌన్‌: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్‌ను జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ శనివారం నియమించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నవంబర్‌ 1 నుంచి 30 వరకు మహాసభలు నిర్వహించి, నూతన జిల్లా కమిటీలను ఎన్నుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement