కలెక్టర్‌ చొరవతో బాలుడికి శస్త్రచికిత్స | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ చొరవతో బాలుడికి శస్త్రచికిత్స

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

● ఏడేళ్ల చిన్నారికి గుండె సంబంధిత వ్యాధి ● సర్జరీకి ముందుకొచ్చిన మెడికవర్‌ ఆసుపత్రి యాజమాన్యం ● వెద్యం, రవాణా, భోజనం ఖర్చులూ భరిస్తామని భరోసా

కై లాస్‌నగర్‌: గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడికి ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షి షా చొరవతో ఉచితంగా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించేందుకు హైదరాబాద్‌లోని మెడికవర్‌ ఆసుపత్రి యాజమాన్యం ముందుకొచ్చింది. సుమారు రూ.7 లక్షల విలువైన శస్త్రచికిత్స ఖర్చును పూర్తిగా తామే భరించడంతో పాటు, బాలుడి కుటుంబానికి భోజనం, రవాణా సౌకర్యాలు కల్పిస్తామని భరోసానిచ్చింది. భోరజ్‌ మండలం పూసాయి గ్రామానికి చెందిన టాప్రే రేణుక –పొచ్చిరాం దంపతుల కుమారుడు అంజి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. గత నెల 10న ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో మెడికవర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత పీడియాట్రిక్‌ కార్డియాలజీ వైద్య శిబిరం నిర్వహించారు. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన నిపుణులు తక్షణమే ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సుమారు రూ.7లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆర్థిక స్థోమత లేని బాలుడి కుటుంబం కలెక్టర్‌ను ఆశ్రయించగా ఆయన స్పందించి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు. దీంతో ఉచితంగా ఆపరేషన్‌ చేసేందుకు వారు అంగీకరించారు. వైద్యశిబిరంలో పరీక్షలు చేయించుకున్న మరో 40 మంది చిన్నారుల్లోనూ గుండె సంబంధిత సమస్యలను వైద్యులు గుర్తించారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి దశలవారీగా ఉచితంగా అవసరమైన శస్త్రచికిత్సలు, వైద్య చికిత్సలు అందించేందుకు యాజమాన్యం ముందుకొచ్చింది. బాలుడి తల్లిదండ్రులతోపాటు ఇతర చిన్నారుల కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో సాధన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement