ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలో పలు చోరీలకు పాల్పడిన ఐదుగురు నిందితులను ఆదిలాబాద్‌రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన ముగ్గురు బాల నేరస్తులతోపాటు ఇద్దరు వివిధ ప్రాంతాల్లో తాత్కాలికంగా ఉంటూ ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఆలయాలు, ఇళ్లలో చోరీలు పాల్పడేవారు. ఈనెల 14న బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు పగులగొట్టి, ధ్వజస్తంభానికి ఉన్న ఇత్తడి తొడుగు, హుండీలో రూ. 2వేలు ఎత్తుఎళ్లారు. గత జూలై 6న మావలలో ఇంట్లో రూ.13వేలు వెండి కడియం, పట్టా గొలుసులతోపాటు పక్కింట్లోకి చొరబడి రూ.5వేలు, అదేనెల 8న మరో ఇంట్లో రూ.10వేలు ఒక బంగారు ఉంగరం, గతనెల 12న ధన్నూర్‌లో ఇంటి ఎదుట బైక్, 17న గిర్నూర్ శివారులో వైన్ షాప్‌లో నగదు, 27న నారాయణపూర్‌లో బైక్, రెండు సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు. సుంకిడి శివారులో ఈనెల 17న అయ్యప్ప స్వామి ఆలయ హుండీలో రూ.2,500 నగదు, 23న ఆదిలాబాద్‌లోని దేవి రెస్టారెంట్ ముందు బైక్‌తోపాటు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ సమీపంలో బట్టలు షాపులో కొన్ని కొత్త బట్టలను అపహరించారు. అదే రోజు రాత్రి సారంగాపూర్ బస్టాండ్ ప్రాంతంలో మరో బైక్‌ను ఎత్తుకెళ్లారు. వైఎస్సార్ కాలనీలో కాపర్ వైరు, నిర్మల్ మండలం మేడిపల్లిలో ఇత్తడి సామగ్రి చోరీ చేశారు. అరెస్టయినవారిలో మహారాష్ట్రకు చెందిన అరుణ్ చవాన్, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌కు చెందిన నిదాన్‌పూర్ క్రిష్ణతోపాటు ముగ్గురు మైనర్లు ఉన్నారు. వారి నుంచి వెండి, 50 కిలోల ఇత్తడి, 4 బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు, రూ.8 వేలు, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.


