ఆదిలాబాద్‌టౌన్: పత్తి కొనుగోళ్లను ప్రైవేట్ వ్యాపారులు, సీసీఐ ఒకేరోజు ప్రారంభించాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ వ్యాపారులు ఈనెల 12న కొనుగోలు చేస్తే, ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ 21న కొనుగోలు చేయడమేమిటని ప్రశ్నించారు. ఒక ప్రాంతంలో ఒకేరకమైన నేలలు, వర్షాపాతం, వాతావరణ పరిస్థితులు ఉంటాయని, వాటి ఆధారంగా దిగుబడులు వస్తాయని పేర్కొన్నారు. సీసీఐ అధికారులకు కనీస పరిజ్ఞానం లేకపోవడం శోచనీయమని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ విషయంపై కలుగజేసుకొని ఒకేరోజు ముహూర్తాన్ని ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐ రంగంలో లేకుంటే మద్దతు ధర విషయంలో రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని తెలిపారు. సమావేశంలో మెట్టు ప్రహ్లాద్, నాయకులు రాజన్న, రాజు తదితరులున్నారు.


