ఇక చెరువుల్లోకి చేప | - | Sakshi
Sakshi News home page

ఇక చెరువుల్లోకి చేప

Sep 30 2026 1:22 AM | Updated on Sep 30 2026 1:22 AM

రెండు, మూడు రోజుల్లో విడుదల ఎదుగుదల కష్టమే అంటున్న మత్స్యకారులు ఎల్‌నినో ప్రభావంతో నిండని జలాశయాలు

జిల్లాలో

మొత్తం చెరువులు: 222

రిజర్వాయర్లు : 2

పూర్తయిన టెండర్‌..

చేప పిల్లల పంపిణీకి సంబంధించి శనివారం ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లు ఖరారయ్యాయి. 35 నుంచి 40 ఎంఎం చేప పిల్లలను వేసేందుకు జగిత్యాలకు చెందిన టెండర్‌దారులు ముందుకు వచ్చారు. మిగతా 80 నుంచి 100 ఎంఎం సైజు గల చేపలను నిజామాబాద్‌కు చెందిన టెండర్‌దారుడు 14లక్షల సీడ్‌ను, నిర్మల్‌కు చెందిన మరో టెండర్‌దారు 18.70 లక్షల చేప పిల్లలను వదిలేందుకు టెండర్‌ దక్కించుకున్నారు. రెండు మూడు రోజుల్లో విడుదల ప్రక్రియ ప్రారంభించడంతో జిల్లాలోని ఆయా చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు వీరు సిద్ధమవుతున్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: ఎట్టకేలకు ప్రభుత్వం చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు చర్యలు చేపట్టింది. మ త్స్యశాఖ మంత్రి వాకాటి శ్రీహరి ఈ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. జిల్లాలోనూ రెండు మూ డు రోజుల్లో వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆన్‌లైన్‌ టెండర్లు జరగగా, ముగ్గురు ముందుకు వచ్చారు. జిల్లావ్యాప్తంగా కోటి 16 లక్షల 24వేల చేప పిల్లలను వదలాలని నిర్ణయించారు. జూలై, ఆగస్టులో విడుదల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా.. టెండర్ల ఖరారు ఆలస్యమైంది. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో చాలాచోట్ల చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు ఇంకా బోసిపోయే ఉన్నాయి. ఈ సారి విడుదల ఆలస్యం కావడం, నీరు కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో చేపల ఎదుగుదలపై ప్రభావం పడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 224 చెరువులు, రిజర్వాయర్లలో కలిపి మొత్తం కోటి 16లక్షల 24వేల చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. 216 చెరువుల్లో 83.54 లక్షల సీడ్‌ వదలనున్నారు. ఈ చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎల్‌ సైజు కట్ల, రాహు, బంగారుతీగ రకం వేయనున్నారు. అలాగే రెండు రిజర్వాయర్ల(సాత్నాల, మత్తడివాగు)లో 80 నుంచి 100 ఎంఎం సైజు గల 15.78 లక్షల పిల్లలు వదలనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఆరు పెద్ద చెరువుల్లో 80 నుంచి 100 ఎంఎం సైజు గల చేప పిల్లలు 16.92 లక్షలను వేయనున్నారు.

గడ్డు కాలమే..

మూడేళ్లుగా చేప పిల్లలను వదలడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. దీంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సరిపడా వర్షాలు లేక చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండలేదు. జూలై, ఆగస్టులో వదలాల్సిన చేప పిల్లలను అక్టోబర్‌లో వదులుతున్నారు. అది కూడా వంద శాతం అనుమానమే. అయితే అధికారులు చెరువులను పరిశీలించి నీరు ఉన్నవాటిలో మాత్రమే చేప పిల్లలు వదిలేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. సీడ్‌ విడుదలలో ఆలస్యం కారణంగా చేపలు పూర్తిస్థాయిలో ఎదగవని, ఇప్పటికే ఎండలు పెరుగుతున్నాయని, దీంతో పిల్ల లు చనిపోయే పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ ఏడాది కూడా గడ్డు కాలమే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడు రోజుల్లో ప్రారంభం..

చేప పిల్లల టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యింది. రెండు మూడు రోజుల్లో విడుదల ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుంది. జిల్లాలో 222 చెరువులు, రెండు రిజర్వాయర్లలో కోటి 16లక్షల 24వేల చేప పిల్లలను వదలడం జరుగుతుంది. ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం.

– సాంబశివ రావు, జిల్లా మత్స్య శాఖ అధికారి

చేపపిల్లల విడుదల లక్ష్యం కోటి: 16లక్షల 24వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement