సమ్మేటివ్‌కు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సమ్మేటివ్‌కు సిద్ధం

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

● అక్టోబర్‌ 1 నుంచి ఎస్‌ఏ–1 పరీక్షలు ● ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ● జంబ్లింగ్‌ మూల్యాంకనంపై రాని స్పష్టత

మంచిర్యాలఅర్బన్‌: పాఠశాల విద్యార్థుల అభ్యాసన పురోగతిని, సామర్థ్యాలను అంచనా వేసేందుకు నిర్వహించే సమ్మేటివ్‌ అసెస్మెంట్‌ (ఎస్‌ఏ –1) పరీక్షల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు బోధించిన పాఠ్యాంశాలను విద్యార్థులు ఏమేరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోనున్నారు. బోధన స్థాయి పరిశీలనకు పరీక్షలు తోడ్పడనున్నాయి. పాఠశాల విద్యార్థులకు సంబంధించి 2026– 27 అకడమిక్‌ సంవత్సరం ఎస్‌ఏ–1 పరీక్షలు ఆక్టోబర్‌ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు శనివారం జిల్లాలోని ఎమ్మార్సీలకు చేరగా వాటిని భద్రపర్చారు. జిల్లాలో ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగనున్నాయి. ఏరోజుకు సంబంధించిన ప్రశ్నపత్రాలను అదేరోజు పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు.

ఎస్‌ఏ–1 పరీక్షలు ఇలా..

ఎస్‌ఏ పరీక్షలకు సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆక్టోబర్‌ 5న ఫస్ట్‌ లాంగ్వేజ్‌తో ప్రారంభమై, 6న ఇంగ్లిష్‌, 7న గణితం, 8న ఈవీఎస్‌, 9న సెకండ్‌ లాంగ్వేజ్‌తో పరీక్షలు ముగియనున్నాయి. అక్టోబర్‌ 1న 6, 7 తరగతులకు ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 8, 9, 10 తరగతులకు గణితం, 3న ఆరు, ఏడు తరగతులకు సెకండ్‌ లాంగ్వేజ్‌, 8, 9, 10 తరగతులకు భౌతిక శా స్త్రం, 5న 6,7 తరగతులకు థర్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లీష్‌), 8, 9, 10 తరగతులకు జీవశాస్త్రం పరీక్షలు, 6న 6,7 తరగతులకు గణితం, 8, 9, 10 తరగతులకు సోషల్‌ స్టడీస్‌, 7న 6,7 తరగతులకు జనరల్‌ సైన్స్‌, 8, 9, 10 తరగతులకు ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 8న 6, 7 తరగతులకు సోషల్‌ స్టడీస్‌, 8, 9, 10న సెకండ్‌ లాంగ్వేజ్‌, 9న 8, 9, 10 తరగతులకు ఇంగ్లిష్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

జిల్లాలో 73,806 మంది విద్యార్థులు..

మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 73,806 (తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియం) మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒకటి నుంచి 5వ తరగతి 22,984 మంది, 6 నుంచి 10వ తరగతి వరకు 50,822 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతులకు సంబంధించి ప్రైవేట్‌ పాఠశాలలకు ప్రభుత్వం ముద్రించిన ప్రశ్నపేపర్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆయా పాఠశాలలు సొంతంగా ప్రశ్నాపత్రం సిద్ధం చేసుకోవచ్చు. 6 నుంచి 10వ తరగతి డిస్ట్రిక్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు (డీసీఈబీ) తయారు చేసిన ప్రశ్నపత్రాలను మాత్రమే వాడాల్సి ఉంది. ఎంజేపీ బీసీ రెసిడెన్షియల్‌కు సొంత ప్రశ్నపత్రాలు సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలల్లో డీసీఈబీ రూపొందించిన ప్రశ్నాపత్రం తప్పనిసరి. గతంలో కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా డీసీఈబీ ప్రశ్నపత్రాలను కాకుండా సొంతంగా రూపొందించిన ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు తప్పనిసరిగా ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నపత్రాలతోనే ఎస్‌ఏ–1 పరీక్షలు నిర్వహించాలని, లేదంటే చర్యలు తప్పవని డీసీఈబీ సెక్రటరీ మహేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

మూల్యాంకనంపై సందిగ్ధత..

పాఠశాల స్థాయి పరీక్షల్లో పారదర్శకత కోసం జవాబు పత్రాలను అదే పాఠశాల టీచర్లతో కాకుండా సమీపంలోని టీచర్లతో దిద్దించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఈవి ధానాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తుండటంతో అమలుపై సందిగ్ధత నెలకొంది. జవాబు పత్రాలను వేరే పాఠశాలలకు పంపించే క్రాస్‌ వాల్యుయేషన్‌ విధానం రద్దు చేసి గతంలో మాదిరి సొంత పాఠశాల ఉపాధ్యాయులే దిద్దుతారా.. లేదా అన్న దానిపై స్పష ్ట త లేదు. ఉపాధ్యాయులకు ప్రాథమిక తరగతుల జవాబు పత్రానికి ఒక్కో దానికి రూ.2 చొప్పున, ఉన్నత తరగతులకు సమాధాన పత్రాలకు ఒక్కోదానికి రూ.3 రెమ్యూనరేషన్‌ చెల్లిస్తారు. మూల్యాంకనం పూర్తయిన వెంటనే మార్కులను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదుచేసి ప్రోగ్రెస్‌ ద్వారా విద్యార్థులకు అందజేయనున్నారు. విద్యార్థుల వార్షిక ప్రగతి నివేదిక తయారీలో, తదుపరి తరగతికి ప్రమోట్‌ చేయడానికి మార్కులను పరిగణలోకి తీసుకోనున్నారు.

ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు..

జిల్లా తరగతులు విద్యార్థుల సంఖ్య

మంచిర్యాల 1–5 22,984

6–10 50,822

నిర్మల్‌ 1–5 20,193

6–10 66,609

ఆసిఫాబాద్‌ 1–5 42,206

6–10 39,505

ఆదిలాబాద్‌ 1–5 21,156

6–10 35,515

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement