ఆదిలాబాద్‌టౌన్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా 10వ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీలిమిటేషన్ పేరుతో నియోజకవర్గాల పునర్విభజనను సాకుగా చూపుతూ మహిళా రిజర్వేషన్ల అమలు జాప్యం చేయడం సరికాదన్నారు. చట్టసభల్లో మహిళలకు జనాభా ప్రాతిపదికన కనీసం 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. మహిళల హక్కుల కోసం చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో లోపాలు ఉన్నాయని అన్నారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన యూపీఐ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నూతన కమిటీ ఎన్నిక..
అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఆర్.అమీన, ఉపాధ్యక్షులుగా పుష్ప, షబానా, ప్రధాన కార్యదర్శిగా ముడుపు నళిని, సహాయ కార్యదర్శిగా ఉమా వందన, కోశాధికారిగా కాంతా బాయి ఎన్నికయ్యారు. 21 మందితో నూతన కౌన్సిల్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంగీత, అనసూర్య, లక్ష్మి, చంద్రకళ, కవిత, సారిక, సమీనా, శిరీష తదితరులు పాల్గొన్నారు.


