నోటీసు వస్తే.. ఓటు తొలగించినట్లు కాదు | - | Sakshi
Sakshi News home page

నోటీసు వస్తే.. ఓటు తొలగించినట్లు కాదు

Sep 19 2026 4:20 AM | Updated on Sep 19 2026 4:20 AM

బీఎల్‌వోలకు తగిన ఆధారాలు అందజేస్తే సరిపోతుంది

అక్టోబర్‌ 7వరకు క్లెయిమ్స్‌ అండ్‌ అబ్జెక్షన్ల స్వీకరణ

‘సాక్షి ఫోన్‌ ఇన్‌’లో ఆర్డీవో పి.జగదీశ్వర్‌రావు

కై లాస్‌నగర్‌: ‘ఎన్నికల సంఘం నుంచి నోటీస్‌ అందినంత మాత్రాన ఓటరు జాబితా నుంచి వారి పేరు తొలగించినట్లు కాదు.. ఈ విషయంలో ఆందోళన వద్దు.. మ్యాపింగ్‌ కాకపోవడం, పేరు, ఇంటిపేరు, చిరునామా తదితర పొరపాట్లు ఉన్న వారికి మాత్రమే నోటీసులు వస్తాయి.. అలాంటి వారు సంబంధిత బీఎల్‌వోలను సంప్రదించి వారు సూచించిన ఏదో ఒక ఆధారాన్ని అందజేస్తే సరిపోతుంది..’ అని ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, ఆదిలాబాద్‌ ఆర్డీవో పి.జగదీశ్వర్‌రావు అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్‌)పై ఓటర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు ‘సాక్షి’ శుక్రవారం ఫోన్‌ ఇన్‌ చేపట్టింది. కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి ఓటర్లు ఫోన్లు చేసి తమ సందేహాలు వ్యక్తం చేయగా.. ఆర్డీవో వాటిని నివృత్తి చేశారు. అనామలిస్‌తో కలిగే ఇబ్బందులను తొలగించేలా బీఎల్‌వోల సర్టిఫికేషన్‌తో సులభతరం చేసినట్లుగా ఆయన స్పష్టం చేశారు.

ఓటరు: మా నాన్న మల్లేశ్‌కు సంబంధించిన ఇంటిపేరు తప్పుగా ఉన్నట్లు నోటీసులు జారీ చేశారు. దీనికి ఏం చేయాలి. (దుబ్బుల చంద్రశేఖర్‌, బజార్‌హత్నూర్‌)

ఆర్డీవో: ఫారం–8ను ఆన్‌లైన్‌లో నింపవచ్చు. లేదా బీఎల్‌వోను సంప్రదించి తగు ఆధారాలతో కూడిన డాక్యుమెంట్‌ అందజేస్తే సరిచేస్తారు.

ఓటరు: మా సోదరికి సంబంధించిన ఓటరు నమోదు దరఖాస్తును డ్రాఫ్ట్‌లిస్టులో తిరస్కరించారు. జాబితాలో పేరు వచ్చేందుకు ఏం చేయాలి. (ముక్కెర మధు, పొన్నారి, తాంసి)

ఆర్డీవో: పదో తరగతి మార్కుల మెమో, సదరు యువతి తండ్రి 2002లో ఓటు హక్కు కలిగి ఉన్నట్లుగా ఆధారం అందజేస్తే ఆ దరఖాస్తును బీఎల్‌వో ఆమోదిస్తారు.

ఓటరు: మహారాష్ట్రకు చెందిన పలువురు మా కాలనీలో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి వారికి ఎలాంటి డాక్యుమెంట్‌ లేదు. ఓటరు జాబితాలో ఎలా నమోదు చేసుకోవాలి. (నల్ల మహేందర్‌, గాంధీనగర్‌, ఆదిలాబాద్‌)

ఆర్డీవో: ఇక్కడి డాక్యుమెంట్స్‌ ఉండాల్సిన పనిలేదు. మహారాష్ట్రలో 2002లో వారి తల్లిదండ్రులు ఓటు వేసినట్లుగా లేదా పుట్టిన తేదీని నిర్ధారించే ఇతర ఏ డాక్యుమెంట్స్‌తోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఓటరు: వయస్సు తప్పుగా ఉందనే కారణంతో నోటీసు జారీ చేశారు. దీన్ని ఎలా సరిచేసుకోవాలి. (రాజు, యాపల్‌గూడ)

ఆర్డీవో: డేట్‌ ఆఫ్‌ బర్త్‌ను ధ్రువీకరించే పదో తరగతి మెమో లేదా టీసీ వంటి డాక్యుమెంట్‌ను బీఎల్‌వోకు అందజేస్తే దాన్ని సరిచేస్తారు.

ఓటరు: మా నాన్న పేరు సరిపోవడం లేదని నోటీసులు జారీ చేశారు. దీన్ని ఎలా సవరించుకోవాలి. (గండ్రత్‌ నారాయణ, శాంతినగర్‌)

ఆర్డీవో: 2002 ఓటరు జాబితాలో పేరు ఉన్నట్లుగా ఆధారాన్ని బీఎల్‌వోకు అందజేయండి. అందులో పేరు ఉన్నట్లైతే దాన్ని ధ్రువీకరించి బీఎల్‌వో కన్ఫర్మేషన్‌ సర్టిఫికేషన్‌తో సరిచేస్తారు.

ఓటరు: నా భార్య ఓటరు కార్డులో తండ్రి పేరుకు బదులుగా భర్తపేరు వచ్చిందని నోటీసులు జారీ చేశారు. మా గ్రామంలో చాలా మందికి ఇదే కారణంతో నోటీసులు ఇచ్చారు. (ఆదిల్‌ మీర్జా బేగ్‌, కేస్లాగూడ(ఎం), ఇంద్రవెల్లి)

ఆర్డీవో: బీఎల్‌వోలను సంప్రదించి వారు సూచించిన డాక్యుమెంట్‌ అందజేస్తే సరి చేస్తారు. ఆందోళన అవసరం లేదు.

ఓటరు: పాత ఐడీ కార్డులో నాభార్య పేరు హాబీబా ఉండగా ప్రస్తుతం హబీబున్నీసా బేగం ఉందని, నా కోడలు పాత కార్డులో ఆసియా అని ఉండగా ప్రస్తుతం ఖాన్‌ అసియాబేగం ఉందనే కారణంతో నోటీసు జారీ చేశారు. (ఖాన్‌ అల్లాబకాస్‌, శాంతినగర్‌, ఆదిలాబాద్‌)

ఆర్డీవో: బీఎల్‌వోలను సంప్రదిస్తే 2002 ఓటరు జాబితాను పరిశీలిస్తారు. అందులో వివరాలను ధ్రువీకరించిన తర్వాత బీఎల్‌వో సర్టిఫికేషన్‌తో సరిచేస్తారు.

ఓటరు: ముసాయిదా ఓటరు జాబితాలో నా పేరును నోమ్యాపింగ్‌ పేరిట రిజెక్ట్‌ అయ్యిందని ఫాంను నాకు తిరిగి ఇచ్చారు. నేనేం చేయాలి (వేల్పుల రాహుల్‌, బజార్‌హత్నూర్‌)

ఆర్డీవో: 01.09.1987కు తర్వాత పుట్టిన వారు వయస్సును ధ్రువీకరించే ఏదైనా ఒక డాక్యుమెంట్‌ ఇస్తే సరిపోతుంది. 1987 నుంచి 2004 మధ్య పుట్టినవారికి నో మ్యాపింగ్‌ పేరిట నోటీసులు వస్తే వారి వయస్సు ఽధ్రువీకరణ, తమ తల్లిదండ్రుల వయస్సును ధ్రువీకరించే ఏదైనా ఒక డాక్యుమెంట్‌ అందజేయాల్సి ఉంటుంది.

ఓటరు: ఇటీవల నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేశాను. కానీ నాకు ఎన్యూమరేషన్‌ ఫారం రాలేదు. నా ఓటు తొలగించినట్లేనా. (ఆశన్న, రాంనగర్‌, ఆదిలాబాద్‌)

ఆర్డీవో: ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఫారం–6ను నింపి 2002 ఓటర్ల జాబితాలో ఉన్న వివరాలను జతచేసి బీఎల్‌వోకు అందజేస్తే పేరును తిరిగి నమోదు చేస్తారు.

ఓటరు: నా భార్య, కోడలుకు నోటీసులు జారీ చేశారు. పాన్‌కార్డు, ఆధార్‌కార్డును ఇవ్వాలని బీఎల్‌వో చెప్పారు. వాటిని అందజేశాం. అయితే ఓటు వస్తుందా లేదా అనేదానిపై ఏం చెప్పడం లేదు. (చాటే సాంబాజీ, గుడిహత్నూర్‌)

ఆర్డీవో: బీఎల్‌ఓలు సూచించిన డాక్యుమెంట్‌ను అందజేశారు కనుక తప్పకుండా ఓటరు జాబితాలో పేర్లు వస్తాయి. ఆందోళన అవసరం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement