భారతీయ రైల్వే ఆమోదం
పారిశ్రామిక, మైనింగ్ కేంద్రాలకు ఊతమిచ్చేలా..
మాజ్రీ–నాందేడ్ మధ్య మార్గానికి అనుసంధానం
పాత ప్రతిపాదనలో ఆదిలాబాద్ నుంచి గడ్‌చందూర్ వరకు..
ప్రాజెక్ట్ వ్యయం తగ్గించడానికి డిజైన్ మార్చారనే విమర్శలు
ప్రాజెక్ట్ వివరాలు ఇలా..
అంచనా వ్యయం
రూ.493 కోట్లు
దూరం 38.21 కిలోమీటర్లు
సాక్షి,ఆదిలాబాద్: ముకుట్‌బన్(ఆదిలాబాద్)–గడ్‌చందూర్ మధ్య కొత్తరైల్వేలైన్‌కు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. జిల్లాకు సరిహద్దున ఉండే మహారాష్ట్రలోని యవత్మా ల్‌జిల్లా ముకుట్‌బన్ మరో వైపున చంద్రపూర్ జిల్లాలోని గడ్‌చందూర్ మార్గంలో దీన్ని నిర్మించనున్నారు. ప్రధానంగా పారిశ్రామిక, మైనింగ్ కేంద్రాలకు రవాణా అనుసంధానం బలోపేతం చేసేందుకు ఈ రైల్వేలైన్‌ను మంజూరు చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య ముఖ్యమైన పారిశ్రామిక, మైనింగ్ కేంద్రాలు ఉన్నాయి. అనేక సిమెంట్ ప్లాంట్లు, వెస్టన్ కోల్డ్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు, సున్నపురాయి గనులు ఉన్నాయి. ఈ పారిశ్రామిక క్లస్టర్‌కు రవాణా అనుసంధానాన్ని కొత్త రైల్వేలైన్ బలోపేతం చేస్తుందని రైల్వే శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
సరుకు రవాణా మరింత సులభతరం
కొత్త రైల్వేలైన్ ద్వారా ఏటా సుమారు 6.08 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతుంద ని అంచనా వేస్తున్నారు. బొగ్గు, సిమెంట్, ఐరన్, ఆహార ధాన్యాలు రవాణా జరుగుతాయని పే ర్కొంటున్నారు. స్థానిక ప్రయాణికుల కోసం ఈ మార్గంలో రోజు రెండు వైపులా ఎంఈఎంయూ రైళ్ల ను నడపాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. బల్లార్షా–నాగ్‌పూర్, వార్దా–మాణిక్‌గడ్ రద్దీ మా ర్గాలపై తీవ్రమైన ఒత్తి డి ఈ కొత్త రైల్వేలైన్ నిర్మాణంతో తగ్గుతుందని అభిప్రాయ పడుతున్నారు. మరాఠ్వాడా(జా ల్నా, పర్భని, ఛత్రపతి శంభా జీనగర్) కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు ప్రయాణ సమయం, రవాణా వ్యయం గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
పాత ప్రతిపాదన ఇలా..
పాత ప్రతిపాదన ప్రకారం ఆదిలాబాద్ నుంచి గడ్‌చందూర్ మధ్య పూర్తిగా నూతన రైల్వేమార్గం దూరం 72కిలోమీటర్లు. ఇది జిల్లాలోని బేల, జైనథ్ మీదుగా వెళ్తుంది. తాజాగా కొత్త రైల్వేలైన్ మార్గం సగానికి తగ్గించారు. కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి, భూసర్వేకు సంబంధించిన గెజిట్‌ను దక్షిణమధ్య రైల్వేజోన్ జూలైలో విడుదల చేసింది. రెండు నెలల్లోపే ఈ మార్గానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు గెజిట్ రావడం గమనార్హం. కేవలం ప్రాజెక్ట్ వ్యయం తగ్గించడానికే రైల్వేమార్గం డిజైన్ మార్చారని, దూరం తగ్గించారనే విమర్శలు ఉన్నాయి. బేల, జైనథ్ వాసులకు రైలు ప్రయాణం అనేది కలగా మిగలనుంది.
ప్యాసింజర్ రైళ్లు నడపడానికి కూడా..
మహారాష్ట్రలోని మాణిక్‌గడ్ నుంచి గడ్‌చందూర్ మధ్య 21కిలోమీటర్ల సింగిల్ విద్యుత్ రైల్వే మార్గం ఉంది. ఇది కేవలం సరుకు రవాణా రైళ్ల కోసం వాడుతున్నారు. ప్రయాణికుల రైళ్లు నడపడం లేదు. ఆదిలాబాద్ నుంచి మాజ్రీ, బల్లార్షా మీదుగా మాణిక్‌గడ్ వెళ్లేందుకు ప్రస్తుతం 158 కిలోమీటర్లు ఉంది. కొత్త లైన్ నిర్మించాక ఇది 48 కిలోమీటర్లు తగ్గి 110 కిలోమీటర్లు ఉండనుందని రైల్వేశాఖ అంచనా వేస్తుంది. ఈ మార్గం పూర్తిగా దక్షిణమధ్య రైల్వేజోన్ పరిధిలో ఉంటుందని చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలోని సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాలతో పాటు రామగుండం, పెద్దపల్లి వెళ్లాలంటే బల్లార్షా మీదుగా పయనించాలి. కొత్త రైల్వేలైన్ పూర్తయితే మాణిక్‌గడ్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి మీదుగా కాజిపేట్ లేనిపక్షంలో వరంగల్ వరకు ఎంఈఎంయూ రైళ్లు నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా ఆదిలాబాద్ నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలోని రైల్వే మార్గాలకు అనుసంధానం పెరగనుంది.
సరిహద్దు ప్రాంతం..
ముకుట్‌బంద్ ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున ఉంటుంది. యవత్మాల్ జిల్లా పరిధిలోకి వచ్చినప్పటికీ ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, జైనథ్, పిప్పల్‌కోటి సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని మాజ్రీ రైల్వే మార్గంలో వచ్చే చిన్నస్టేషన్ ముకుట్‌బంద్. ఆదిలాబాద్ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.


