దేశ సేవలో పల్లె బిడ్డలు | - | Sakshi
Sakshi News home page

దేశ సేవలో పల్లె బిడ్డలు

Sep 13 2026 11:57 PM | Updated on Sep 13 2026 11:57 PM

● ఒకే గ్రామం నుంచి 40మంది సైనికులు ● అదే స్ఫూర్తితో మరికొందరు.. ● ఆదర్శంగా నిలుస్తున్న కిష్టాపూర్‌

నేరడిగొండ: పల్లె వాతావరణంలో పెరిగిన యువత తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంతో పాటు దేశ రక్షణలోనూ భాగస్వాములవుతున్నారు. మండలంలోని కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన 40మంది యువకులు సైన్యంలో చేరి దేశ సేవలో నిమగ్నమయ్యారు. గ్రామంలో మొత్తం 710 జనాభా ఉండగా, 180 కుటుంబాలు, 620 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామం నుంచి ఇంతమంది యువకులు ఆర్మీలో చేరడం ప్రత్యేకతగా నిలుస్తోంది.

దేశ సేవ కోసం అడుగులు..

గ్రామానికి చెందిన పలువురు యువకులకు చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలనే కోరిక ఉండేది. ఆ దిశగా పట్టుదలతో ముందడుగు వేశారు. శారీరక శిక్షణ తీసుకుని, ఆర్మీ నియామకాల్లో పాల్గొని ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం వీరిలో కొందరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

వారిని చూసి.. మరికొందరు

గ్రామానికి చెందిన పలువురు ఇప్పటికే సైన్యంలో సేవలందిస్తుండటంతో వారిని చూసి మరికొందరు గ్రామ యువకులు అదే బాట పట్టారు. ఆర్మీలో కొలువే లక్ష్యంగా సిద్ధమవుతున్నారు. సైనికులుగా పనిచేస్తున్న వారు సెలవుల్లో గ్రామానికి వచ్చినప్పుడు వీరికి అవసరమైన సూచనలు, శిక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.

కుటుంబాలకు గర్వకారణం..

దేశరక్షణ కోసం తమ పిల్లలు దూరప్రాంతాల్లో విధులు నిర్వహిస్తుండటంతో వారి కుటుంబ సభ్యులు గర్వంగా భావిస్తున్నారు. పండుగలు, ఇతర వేడుకలకు దూరంగా ఉన్నప్పటికీ దేశసేవకు ప్రాధాన్యం ఇస్తున్న తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకే గ్రామం నుంచి 40 మంది యువకులు సైన్యంలో చేరడం.. గ్రామీణ యువతలోని దేశభక్తికి, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement