నెల్లూరు(బృందావనం): పరిశుద్ధ కోడూరు వేళాంగణి మాత జన్మదిన మహోత్సవాలు కొత్తకోడూరు బీచ్, మహాలక్ష్మీపురంలో ఈనెల 6, 7, 8 తేదీల్లో వైభవంగా జరుగుతాయని రోమన్ కేథలిక్ మిషన్ నెల్లూరు బిషప్ మోస్ట్ రెవరెండ్, మేత్రాసన గురువులు డాక్టర్ పిల్లి ఆంథోనిదాస్, విచారణ గురువులు, డైరెక్టర్ ఫాదర్ పినపాటి లూకాస్‌రాజ్ తెలిపారు. పోస్టర్లు, ఆహ్వానపత్రికలను శుక్రవారం సంతపేటలోని రోమన్ కేథలిక్ మిషన్ బిషప్ హౌస్‌లో ఫాదర్స్ కొండెపోగు ప్రేమ్‌రాజ్, మనోహర్, జాన్, రాయప్ప, బి.పాల్, షడ్రఖ్‌లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహోత్సవాలను ఆర్సీఎం నెల్లూరు బిషప్ మోస్ట్‌రెవరెండ్ డాక్టర్ ఎండీ ప్రకాశం ప్రారంభిస్తారన్నారు. రోజూ సాయంత్రం 6 గంటలకు జపమాల, తేరుప్రదక్షిణ, దివ్య బలిపూజ, రోగుల కోసం ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా జరుగుతాయన్నారు. తొలిరోజు ఆదివారం సాయంత్రం మరియతల్లి – ఆధునిక ప్రపంచానికి ఆశాదీపంపై ధ్యానాంశం నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు మహోత్సవాల్లో పాల్గొని వేళాంగణిమాతను దర్శించుకుని పునీతులు కావాలన్నారు. ఆత్మకూరు బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం ఉందన్నారు. అలాగే మూడురోజులు భక్తుల కోసం సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.


