సర్కారు బడిపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడిపై ఫోకస్‌

Sep 3 2026 4:27 AM | Updated on Sep 3 2026 4:27 AM

ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్‌

విద్యా సామర్థ్యాల పెంపునకు చర్యలు

ప్రతిరోజూ స్పోకెన్‌ ఇంగ్లిష్‌, ఇతర అంశాలపై శిక్షణ

విద్యార్థుల ప్రగతిపై ప్రతినెలా సమీక్ష

ఆదిలాబాద్‌టౌన్‌: కలెక్టర్‌ రాజర్షిషా సర్కారు బడుల పై ఫోకస్‌ పెంచారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చేలా చర్యలు చేపడుతున్నారు. పిల్లల ప్రగతిని పరిశీలించేందుకు ప్రతినెలా ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఆ శాఖాధికారులతో సమీక్షలు నిర్వహించేలా ఇప్పటికే ప్రణా ళికలు రూపొందించారు. తదనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు.

జిల్లా వెనుకంజ

అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్‌ జిల్లా చదువుల పరంగా వెనుకబడి ఉంది. సర్కారు బడుల్లో చదివే చాలామంది చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయడంలో వెనుకబడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పర్ఫామెన్స్‌ గ్రేడ్‌ ఇండెక్స్‌(పీజీఐ)లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 33వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు ప్రాథమిక, ఉన్నత తరగతుల విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపర్చడంతో పాటు విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు కలెక్టర్‌తో పాటు విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలల్లో నాణ్యమైన బోధన, విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ప్రాధాన్యత సంతరించుకుంది. పాఠశాలలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. డీఈవో, ఏఎంవో, ఎంఈవో, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, సీఆర్పీలు, అకాడమిక్‌ ప్యానల్‌ తనిఖీ బృందం నిరంతరం తనిఖీలు చేసి సామర్థ్యాలను తెలుసుకోవాల్సి ఉంది. అవసరమైన సూచనలు విద్యార్థులకు అందజేయాలి.

రోజూ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులు..

సర్కారు బడుల్లో చదివే ప్రతి విద్యార్థి ఆంగ్లంపై పట్టు సాధించేలా కలెక్టర్‌ చొరవ చూపుతున్నారు. సబ్జెక్టులతో పాటు ప్రతిరోజు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులు ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా విద్యార్థులకు బోధించాల్సి ఉంది. అలాగే 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తెలుగు, ఇంగ్లిష్‌, గణితం సబ్జెక్టులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ఫోకస్‌ పెట్టనున్నారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చదవడం, రాయడం వచ్చేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం.

జిల్లాలో ప్రభుత్వ

పాఠశాలల వివరాలు

డీఈవో పరిధిలోనివి 678

ప్రాథమిక 467

ప్రాథమికోన్నత 105

ఉన్నత 106

మొత్తం విద్యార్థులు 58వేలు

విద్యార్థుల ప్రగతిపై నిఘా..

సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల ప్రగతిని పరీక్ష ఫలితాల ఆధారంగా కాకుండా తరగతుల వారీగా అభ్యసన స్థాయిని ప్రత్యేకంగా అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, గణిత ప్రాథమిక అంశాలు, సైన్స్‌ అవగాహన వంటి విషయాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపేలా పర్యవేక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నారు. సెప్టెంబర్‌ 15 నుంచి 19 వరకు మండల స్థాయిలో టీఎల్‌ఎం మేళా, 22న జిల్లా స్థాయిలో నిర్వహించేలా సన్నద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement