పారదర్శక ఓటరు జాబితాకు సహకరించాలి
కై లాస్‌నగర్: జిల్లాలో పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా తయారీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం నోమ్యాపింగ్, వ్యత్యాసాలు ఉన్నవారికి నోటీసులు జారీ చేసి ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి విచారణ చేపడుతున్నామని అన్నారు. ఓటరే స్వయంగా హాజరుకావాలనే నిబంధన లేదని, వారు రాలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు లేదా బంధువులు సైతం హాజరు కావచ్చని స్పష్టం చేశారు. విచారణకు వచ్చేవారు కుల, జనన ధ్రువీకరణ, పాస్‌పోర్టు, శాశ్వత నివాసపత్రం, మెట్రిక్యులేషన్, అటవీ హక్కుల పత్రం లేదా ప్రభుత్వ ఇళ్ల పట్టాలు వంటి గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒక ఒరిజినల్ సర్టిఫికెట్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. నిర్దేశిత తేదీల్లో విచారణకు హాజరు కాలేకపోయిన వారికి తదుపరి ఏడు రోజుల వ్యవధిలో విచారణకు హాజరయ్యే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. అలాగే 2026 అక్టోబరు 1నాటికి అర్హత సాధించేవారు, జాబితాలో పేర్లు లేనివారు లేదా తప్పుల సవరణ కోరే వారి కోసం సెప్టెంబరు 5, 6, 12, 13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారని తెలిపారు. కొత్తగా పేరు నమోదుకు ఫారం–6, మార్పులు–చేర్పులు లేదా అభ్యంతరాలకు ఫారం–8తో పాటు డిక్లరేషన్ ఫారమ్‌లను పూర్తి చేసి ఆయా పోలింగ్ కేంద్రాల్లోని బీఎల్‌వోలకు అందజేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో జగదీశ్వర్ రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, తహశీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే క్షయ రహిత
సమాజం
కై లాస్‌నగర్: ప్రజల భాగస్వామ్యంతోనే క్షయ(టీబీ) రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ఆదిశగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాధి ముందస్తు గుర్తింపు, నివారణ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో సాధన, జిల్లా క్షయ నియంత్రణ అధికారి సుమలత, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, జెడ్పీ సీఈవో రవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


