సాక్షి, ఆదిలాబాద్: ‘ఉట్నూర్ పీఏసీ సమావేశంలో ఇటీవల జరిగిన గొడవకు ముఖ్య కారకులు జిల్లా అధ్యక్షుడు నరేశ్‌జాదవే. పీఏసీ కమిటీ ఏర్పాటులో ఆయన నియోజకవర్గ ఇన్‌చార్జీలను సంప్రదించలేదు. ప్రొటోకాల్‌లో ఉన్న వారిని కాకుండా తనకు నచ్చిన మాజీ నాయకులను తీసుకున్నారు. అందుకే ఆ గోడవ జరిగింది. ఈ విషయం మీ దృష్టికి తెస్తున్నాను..’ డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్‌పై పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడె గజేందర్ శనివా రం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు చేసిన ఫిర్యాదుల్లో ఇదొక్కటి.
జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి రగులుతోంది. ఇటీవల ఉట్నూర్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా పీఏసీ సమావేశంలో జరిగిన గొడవ మరిచిపోకముందే బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి గజేందర్ ఏకంగా జిల్లా అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ తాడోపేడో తేల్చుకునేందుకు టీపీసీసీకే ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం ఆయన నియోజకవర్గం నుంచి సుమారు 40 వాహనాల్లో వందలాది మంది కార్యకర్తలతో కలిసి హైదరాబాద్‌కు తరలివెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడిని కలిసి ఫిర్యాదు చేయడం పార్టీలో సంచలనం కలిగిస్తోంది.
ఫిర్యాదు అంశాలు ఇలా..
బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతమే ల క్ష్యంగా తాను నిరంతరం పనిచేస్తున్నప్పటికీ తనపై నరేశ్‌జాదవ్ టీపీసీసీ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, అధి ష్టానం వద్ద నిత్యం ఫిర్యాదులు చేస్తున్నాడని గజేందర్ పేర్కొన్నాడు. దీంతో పార్టీ అంతర్గత ఐక్యత దెబ్బతింటుంది. గ్రూపు రాజకీయాలు పెరిగాయి. జిల్లా కాంగ్రెస్ కార్యవర్గంలో ఓ పది మంది మినహా మిగతా అందరూ పార్టీ కోసం చురుగ్గా పనిచేయని వారిని ఎంపిక చేశారు. ఏఐీసీసీ, టీపీసీసీ పిలుపుని చ్చే ధర్నాలు, నిరసనలు ఇతరకార్యక్రమాల్లో కూడా జిల్లా కార్యవర్గ సభ్యుల హాజరు పదిమంది కంటే ఎక్కువగా ఉండటం లేదు. నియోజకవర్గ ఇన్‌చార్జీ లు, సీనియర్ నాయకులు, మండల స్థాయి నాయకులతో తగిన సంప్రదింపులు జరుపకుండా మండ ల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను నియామకం చేశా రు. నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించడం లేదు. హైదరాబాద్‌కే ఎక్కువగా పరి మితమవుతున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు ఆయన వచ్చిన నాటి నుంచి ఆగిపోయాయి. పార్టీ నుంచి పలువురు బీఆర్‌ఎస్, బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. సొంత మండలం గుడిహత్నూర్‌లోనే ఈ పరిస్థితి ఉంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, సర్ ఇన్‌చార్జీలు జిల్లాకు వచ్చినప్పుడు మాత్ర మే సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఓటరు సవరణ ప్రక్రియను సరిగా పర్యవేక్షించడం లేదు. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చే ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షుడు స్వయంగా పాల్గొనడం లేదు. పార్టీ పదవులు అనుబంధ సంస్థల కార్యవర్గాలు, మండల అధ్యక్షుల నియామాకాల్లో నియోజకవర్గ ఇన్‌చార్జీ లను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. దీని వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. సంతగ్రామంలో సర్పంచ్‌ను గెలిపించుకోలేకపోయారు. తాను మాత్రం 110 మంది సర్పంచ్‌లను నియోకవర్గంలో గెలిపొందేలా కృషి చేశానంటూ ఫిర్యాదులో గజేందర్ వివరించాడు.
అతన్ని తొలగించండి
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడానికి సంస్థాగతంగా తగిన మార్పులు చేయాల్సిన అవసరముందని పీసీసీ అధ్యక్షుడి దృష్టికి గజేందర్ తీసుకెళ్లాడు. జిల్లాలో పార్టీ ప్రస్తుత పరిస్థితిపై సమ గ్ర సమీక్ష నిర్వహించి నియోజకవర్గ ఇన్‌చార్జీలు, సీనియర్ల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరాడు. నరేశ్‌జాదవ్‌ను అధ్యక్ష పదవీ నుంచి తప్పించి సమర్థుడైన కొత్త వారిని నియమించాల్సిన అవసరముందని వివరించాడు.
మహేశ్‌కుమార్ గౌడ్ ప్రతిస్పందన..
గజేందర్ కార్యకర్తలతో కలిసి హైదరాబాద్‌లో మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు అందజేసే సందర్భంగా ఆయన ప్రతిస్పందించారు. పార్టీ పదవుల పరంగా కొత్తగా వచ్చిన వారికి ఒకటి, రెండు ఇవ్వడం జరుగుతుందన్నారు. ముందు నుంచి పార్టీ కోసం శ్రమించిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. వారి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చింది గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. నరేశ్‌జాదవ్, అడె గజేందర్ చెప్పిన వారికో, ఎవరో ఇచ్చిన జాబితాలో ఉన్న వారికి పదవులిస్తే పార్టీ సంకనాకిపోతుందని స్పష్టం చేశారు. కేడర్‌కు భరోసానిచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రూల్ ప్రకారమే పదవులు ఇవ్వడం జరుగుతుందని వివరించారు.


