మానవ సేవే మాధవ సేవ అని చాటిన మహనీయుడు భక్తులకు మార్గదర్శకంగా నిలిచిన పూలాజీబాబా నేడు పట్నాపూర్‌లో అధికారికంగా జయంతి వివిధ ప్రాంతాల నుంచి తరలిరానున్న భక్తులు
నార్నూర్/కెరమెరి: ‘అనంత విశ్వంలో మనమున్నాం.. మనలోనూ విశ్వం దాగి ఉంది.. పంచభూతాల నిలయమే మానవ దేహం.. అదే ఈశ్వర త త్త్వం.. ఈ దేహమే దేవాలయం.. జీవుడే దేవుడు’ అంటూ మానవుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయుడు సంత్ శ్రీ పూలాజీ బాబా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుమురంభీం జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్‌లో ‘శ్రీసిద్ధ్ మహాయోగ పీఠం నెలకొల్పి ఆధ్యాత్మికతను విస్తరించారు. పూ లాజీ బాబా 1925 ఆగస్టు 30న మహారాష్ట్రలోని పర్భణి జిల్లా ఔండ్ నాగనాథ్ తాలూకా సావళి (బాయనరావు)గ్రామంలో పుంజాబాయి–దోండో బా ఇంగ్లే దంపతులకు జన్మించారు. 1945లో ఆ కుటుంబం జీవనోపాధి కోసం పట్నాపూర్‌కు వలసవచ్చి ఇక్కడే స్థిరపడింది. బాబా తల్లి పుంజాబా యి గొప్ప భక్తురాలు. భజనలు, పూజలు, సత్సంగాలతో ఆమె ఆధ్యాత్మిక సాధన చేసేవారు. తల్లి బోధనలు, గురూజీ గణపతి వాడ్గురే సహవాసం పూలాజీ బాబాలోని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మేల్కొలిపాయి. ‘పరమయోగి పరమహంస’గా భక్తుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న పూలాజీబాబా 2018 డిసెంబర్ 25న తనువు చాలించారు. ఆయ న ప్రేరణతో 350కుపైగా ధ్యాన కేంద్రాలు ఏర్పడ్డాయి. ఆదివారం పట్నాపూర్‌లో బాబా జయంతి వేడుకలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పా ట్లు చేశారు.
పంచాగ్ని యోగసాధన
సాధారణ జీవితాన్ని త్యజించి మలెంగి తపోవనంలో చాలాకాలం పాటు పంచాగ్ని యోగసాధన చేసినట్లు తెలుస్తోంది. వేదాలు, ఉపనిషత్తులు, ఆధ్యాత్మిక గ్రంథాలను లోతుగా అధ్యాయనం చేసి యోగిగా పరిణతి చెందారు. తన బోధనలతో సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించారు. కోటీశ్వరుల నుంచి కటిక పేదల వరకు ఎంతోమంది పూలాజీ బాబా బోధనలతో ప్రభావితమై తమ జీవితాలను మార్చుకున్నారు. చెడు అలవాట్లకు దూరమై మద్యం, మాంసాహార వినియోగాన్ని విడిచిపెట్టిన వారెందరో ఉన్నారు. ‘మానవ సేవ యే మాధవ సేవ’ అనే భావనతో ఆయన సాగించిన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాల్లో వేలాది మంది భక్తులు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ప్రతీరోజు ఆయా కేంద్రాల్లో పూజలు, భజనలు చేస్తారు.
మూడు రాష్ట్రాల నుంచి భక్తులు రాక..
కుమురంభీం జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్‌లో నేడు నిర్వహించనున్న పూలాజీ బాబా జయంతి వేడుకలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలిండియా ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీరావు మోగే, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్‌లు హరిత, రాజర్షిషా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, ఎస్పీ నితికపంత్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జుపటేల్, అనిల్ జాదవ్, కిన్వట్ ఎమ్మెల్యే కేరాం భీంరావు, తదితరులు హాజరుకానున్నారు.


