ఆసిఫాబాద్‌అర్బన్: ఓ ఇంట్లో చోరీ జరిగిన కేసును 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆసిఫాబాద్ సీఐ నీలం రవి తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని కొత్త రహపల్లికి చెందిన ముంజం లలిత ఈ నెల 16న ఇంటికి తాళం వేసి పంటచేలకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి అల్మారాలో ఉన్న సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన వడై లాలాజీని అదుపులోకి తీసుకుని 38.320 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.


