బాసర: ఆర్జీయూకేటీ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సెమీకండక్టర్ డిజైన్‌పై ఐదు రోజుల జాతీయ స్థాయి బూట్‌క్యాంప్ శిక్షణ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. బాసర ఆర్జీయూకేటీ, నైలిట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం ఈ నెల 22 వరకు కొనసాగనుంది. ‘సెమీకండక్టర్ డిజైన్: ఆర్‌టీఎల్, ఐపీ ఇంటిగ్రేషన్, ఎస్‌ఓసీ సైన్‌ఆఫ్’ అంశాలపై విద్యార్థులకు నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా లోతైన విజ్ఞానాన్ని సాధించవచ్చన్నారు. వైఫల్యాలను నిరాశగా కాకుండా పాఠాలుగా మలుచుకోవాలని సూచించారు. వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించేందుకు దేశ, విదేశాల్లోని ప్రముఖ సంస్థలతో మరిన్ని ఒప్పందాలు చేసుకోనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, ఓఎస్‌డీ ఏవో ప్రొఫెసర్ మురళీదర్శన్, నైలిట్ హైదరాబాద్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ లక్ష్మణ్ కొర్రా, ఐడెక్స్ మాజీ డైరెక్టర్ కల్నల్ (రిటైర్డ్) ఏకే సింగ్, వీరా టాక్టికల్ డైనమిక్స్ సీఈఓ సాయితేజ పెద్దినేని, తదితరులు పాల్గొన్నారు.


