టెలికాం సేవలు
బలోపేతం చేయాలి
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టెలికాం సేవలను మరింత బలోపేతం చేసి, మారుమూల గ్రామాలకు మెరుగైన మొబైల్ నెట్‌వర్క్ అందేలా చర్యలు చేపట్టాలని ఎంపీ గోడం నగేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయంలో టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో సెల్ టవర్ల నిర్వహణ, కొత్త టవర్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. బీఎస్‌ఎన్‌ఎల్ పీజీఎం వెంకటేశ్వర్లు, సలహా కమిటీ సభ్యులు ఎస్.కృష్ణకుమార్, బూర రమేష్, కే.వినోద్‌కుమార్, కొండ ప్రభాకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
యువకుడిని కాపాడిన పోలీసులు
కడెం: కడెం ప్రాజెక్ట్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని పోలీసులు కాపాడారు. మండల కేంద్రానికి చెందిన రాజ్‌కుమార్ మద్యానికి బానిసయ్యాడు. తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. సోమవారం రాత్రి కడెం ప్రాజెక్ట్ కుడి కాలువ వద్ద దూకేందుకు ప్రయత్నిస్తుండగా అటుగా పెట్రోలింగ్‌కు వెళ్లిన బ్లూ కోర్ట్ కానిస్టేబుళ్లు వెడ్మ భీంరావు, గణేశ్ యువకుడిని బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. అనంతరం అతని ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు.
అర్లి(టి) శివారులో
పులి సంచారం
తాంసి: భీంపూర్ మండలంలోని అర్లి(టి) శివారులో మంగళవారం పంటచేలకు వెళ్లిన మహిళా కూలీలకు పులి కనిపించడంతో భయంతో ఇంటికి పరుగులు తీశారు. పత్తి చేనులో అడవిపంది కళేబరం కనిపించడంతో పులి దాడిచేసి హతమార్చినట్లు గుర్తించారు. ఈ విషయమై అటవీశాఖ సెక్షన్ అధికారి మోపత్‌రావును సంప్రదించగా పులి పాదముద్రలుగా గుర్తించామన్నారు. పులి సంచారం ఉన్నందువల్ల రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పులి కదలికలను ఎనిమల్ ట్రాకర్స్ ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పులి కనిపిస్తే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.
శీర్షాలో పెద్దపులి సంచారం
కౌటాల: కౌటాల మండలం శీర్షా గ్రామ శీవారులోని పత్తి చేనులో మంగళవారం పెద్దపులి సంచరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పులి పాదముద్రలు గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు తులసీదాస్, శ్రీదేవి మాట్లాడుతూ పెద్దపులి సిర్పూర్(టి) మండలం కొమ్ముగూడ నుంచి శీర్షా పంట పొలాల మీదుగా చింతలమానెపల్లి మండలం డబ్బా అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని గ్రామపంచాయతీ కార్యదర్శి కై లాస్ మండల కేంద్రంలో టాం టాం వేయించారు. కంకమల్మ గుట్ట ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారని, గుట్టకు ఆవులు, మేకలు, గొర్రెలను తోలుకుని వెళ్లవద్దని సూచించారు.
నాగోబా ఆలయ
హుండీ లెక్కింపు
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో నాగుల పంచమిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన హుండీని మంగళవారం మెస్రం వంశీయులు లెక్కించారు. రూ.1,06,035 ఆదాయం వచ్చిందని నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ తెలిపారు. ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి సహకరించిన పోలీసులు, అధికారులకు మెస్రం వంశీయుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెస్రం తుకారాం, మెస్రం వంశీయులు పాల్గొన్నారు.


