డీఎస్సీలో అక్రమాలపై నేడు ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీలో అక్రమాలపై నేడు ర్యాలీ

Aug 10 2026 12:16 AM | Updated on Aug 10 2026 12:16 AM

రంపచోడవరం: ఏపీలో మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రంపచోడవరంలో ర్యాలీ నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, దానికి కారణమైన మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు భృతి అందించాలని, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇవ్వాలని అన్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రంపచోడవరం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.

మాల్‌ యాజమాన్యంపై

చర్యలకు డిమాండ్‌

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరంలో ప్రసాద్‌ ఆదిత్య మాల్‌ వద్ద జరిగిన ఘటనలో మెడికో ప్రియాంక మృతి చెందగా, ఆమె కుటుంబాన్ని మాల్‌ యాజమాన్యం ఆదుకోవాలని వైఎస్సార్‌ సీపీ అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు. ఆదివారం రాత్రి ఆ మాల్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ యువ నాయకుడు జక్కంపూడి గణేష్‌ ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థులతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రియాంకను కారుతో పలుమార్లు ఉద్దేశ పూర్వకంగా ఢీకొని ఆమె మృతికి కారకులైన ఇద్దరు యువకులపై హత్య కేసు నమోదు చేయాలన్నారు. మద్యం తాగిన వ్యక్తులను మాల్‌ యాజమాన్యం ఏ విధంగా లోపలకు అనుమతించిందని ప్రశ్నించారు. ఇందులో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. యువజన నేత జక్కంపూడి గణేష్‌ మాట్లాడుతూ మాల్‌లోకి తాగుబోతులు రావడంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. కనీసం మానవత్వం లేకుండా మాల్‌ యాజమాన్యం ప్రవర్తించడం, ఘటనపై పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ప్రియాంక మృతిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని గణేష్‌ డిమాండ్‌ చేశారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలి ఆనంద్‌, నాయకులు నందెపు శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌ పోలు విజయలక్ష్మి, మహిళా నాయకురాలు సంకిస భవానీప్రియా, బీసీ మహిళా నాయకురాలు బర్ల సీతారత్నం, సరిత, రాణి, తగరం సోము పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement