సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గిరిజన జీవనశైలి సమాజానికి ఆదర్శమని కలెక్టర్ కీర్తి అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని సెమినార్ హాల్లో ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ తదితర అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ప్రకృతికి అత్యంత సమీపంగా జీవించడం వల్ల గిరిజన సమాజానికి చెట్లు, వాతావరణం, ప్రకృతి చక్రాలపై అపారమైన పరిజ్ఞానం ఉందన్నారు. ఆ సాంస్కృతిక సంపదను, కళలను ఒక తరం నుంచి మరొక తరానికి విజయవంతంగా అందిస్తున్నారని కొనియాడారు. ‘నేను’ అనే స్వార్థ భావన కంటే ‘మనము’ అనే సమష్టి భావన గిరిజన జీవనశైలిలో కనిపిస్తుందని, ఈ గుణాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన విద్యార్థుల సౌకర్యార్థం రెండు హాస్టల్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని క్రమశిక్షణతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని విద్యార్థులకు హితవు పలికారు. జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ గిరిజన అభివృద్ధి అంటే వారి సంస్కృతి, జీవన విధానాన్ని పూర్తిగా మార్చడం కాదని, వారి మూలాలను పరిరక్షిస్తూ విద్య, వైద్యం వంటి ఆధునిక సదుపాయాలను అందించడమని అన్నారు.


