రంపచోడవరం: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆదివాసీ హక్కులను కాలరాస్తుందని, 1/70 చట్టం రద్దుకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు పి.టాన్యా పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం, రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రంపచోడవరంలో రాష్ట్ర సదస్సు జరిగింది. టాన్యా మాట్లాడుతూ తెలంగాణ నక్సల్‌బరి, గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాలు ఫలితంగానే 1/70 చట్టం, అటవీ హక్కుల సంరక్షణ చట్టం, పీసా చట్టం, ఆదివాసీలకు నూరు శాతం ఉద్యోగాలు అందించే జీఓ 3, భారత రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూల్స్ తదితర చట్టాలు వచ్చాయని అన్నారు. ఈ చట్టాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో 48 శాతం ఆదివాసీల భూములు గిరిజనేతరుల చేతుల్లో ఉన్నాయన్నారు. ఆదివాసీలకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని రద్దు చేయాలని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని 1,672 మంది గిరిజనేతరులు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ పిటీషన్ వెయ్యకుండా కాలయాపన చేస్తున్నాయని మండిపడ్డారు. ఆదివాసీ ప్రాంతాల్లోని రూ.లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను బడా కార్పొరేట్లకు అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని, ఈ విధానాలను అడ్డుకుంటున్నారని అన్నారు. పోలవరం, ముసురుమిల్లి, భూపతిపాలెం ప్రాజెక్ట్‌ల నిర్వాసితులకు భూమికి భూమి ఆర్ అండ్‌ఆర్ ప్యాకేజీ, పక్కా ఇళ్లు పూర్తి స్థాయిలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభయారణ్యాలు, నేషనల్ పార్క్‌ల పేరుతో ఆదివాసీలను గెంటివేసే కార్యక్రమాలు విడనాడాలని అన్నారు. అల్లూరి, కొమరం భీమ్, బిర్సాముండా వంటి వారి స్ఫూర్తితో ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో నాయకులు టి.ప్రకాష్, లచ్చిరెడ్డి, అనసూయ, దూలయ్య తదితరులు పాల్గొన్నారు.


