వాతావరణం
పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
దిలాబాద్‌టౌన్: నులిపురుగులు కనిపించని శత్రువులైనా, వాటి ప్రభావం పిల్లల ఆరోగ్యం, విద్య, భవి ష్యత్తుపై తీవ్రంగా ఉంటుంది. పరిశుభ్రత, అవగా హన, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం, తల్లిదండ్రుల జాగ్రత్తలు కలిసొస్తేనే ఈ సమస్యను సమర్థంగా అరికట్టవచ్చు. ఆరోగ్యవంతమైన బాల్యం కోసం నులిపురుగుల నివారణను ప్రతి కుటుంబం తమ బాధ్యతగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తించే నులిపురుగును నలిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏటా నులిపురుగు నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తోంది. నులిపురుగుతో చిన్నారుల్లో పోషకాహార లోపం, రక్తహీనత, ఎదుగుదల మందగించడం, చదువులో ఏకాగ్రత తగ్గడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఏటా వర్షాకాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నా రు. వీటి నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు వేస్తా రు. ఇందులో భాగంగా సోమవారం ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మాత్రలు వేసుకోని చిన్నారుల ను గుర్తించి ఈనెల 20న వేయనున్నారు.
నులి పురుగులంటే..
పిల్లల పేగుల్లో ఆహారంలోని పోషకాలను గ్రహించి జీవించే పరాన్నజీవులను నులిపురుగులు అంటారు. ఏలికపాములు, నట్టలు వంటి రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత పేగుల్లో పెరిగి ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తాయి. దీంతో చిన్నారుల్లో ఆకలి మందగించడం, ఎదుగుదల లోపం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. నీరసంగా ఉండడంతో చదువుపై దృష్టి సారించకుండా ఉంటారు. బహిరంగ మలవిసర్జన, అపరిశుభ్రమైన పరిసరాలు, కలుషితమైన తాగునీరు, సరిగా కడగని కూరగాయలు, పండ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోకుండా భోజనం చేయడం వంటి కారణాలతో నులిపురుగుల గుడ్లు శరీరంలోకి చేరుతాయి. చెప్పులు లేకుండా మురికి నేలపై నడవడంతో కూడా కొన్ని రకాల నులిపురుగులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
19 ఏళ్ల లోపు వారికి..
1 నుంచి 19 ఏళ్ల లోపు వారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. కాగా పారిశుధ్య సౌకర్యాలు తక్కువగా ఉన్న గ్రామాల్లో నివసించే ప్రజలు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతుంటారు. పిల్లల్లో పరిశుభ్రత అలవాట్లు లేకపోవడం కూడా ప్రధాన కారణని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచూ కడుపునొప్పి, ఆకలి తగ్గిపోవడం, బరువు పెరగకపోవడం, రక్తహీనత, అలసట, నీరసం, రాత్రి సమయంలో మలద్వారం వద్ద దురద, వాంతులు, విరేచనాలు, చదువుపై ఏకాగ్రత తగ్గడం, శారీరక ఎదుగుదల మందగించడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
జిల్లాలో..
1 నుంచి 19 ఏళ్లలోపు వారు : 2,4,462
అంగన్‌వాడీ కేంద్రాలు: 1283,
చిన్నారులు : 53,223
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు : 1273
విద్యార్థులు : 84,270
జిల్లాలో జూనియర్ కళాశాలలు : 20
ఇంటర్ విద్యార్థులు : 12,722
ప్రైవేట్ పాఠశాలలు : 162
విద్యార్థులు : 43,587
ఆశ కార్యకర్తలు : 992
అంగన్‌వాడీ టీచర్లు : 1296
అందుబాటులో ఉన్న ఆల్బెండజోల్
మాత్రలు: 2,21,900
చిన్నారులందరికీ తప్పనిసరిగా వేయించాలి..
1 నుంచి 19 ఏళ్లలోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. తల్లిదండ్రులు సహకరించాలి. ఒకట్రెండు సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర నీటిలో కలిపి వేయాలి. పట్టణంలోని బ్రాహ్మణవాడ పాఠశాలలో కార్యక్రమాన్ని కలెక్టర్ సోమవారం ప్రారంభించనున్నారు. ఇందులో వేయించని వారికి ఈనెల 20న వేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. చిన్నారులందరికీ ఈ మాత్రలు తప్పనిసరి.
– వైసీ శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి


