ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఆధ్వర్యంలో ఈనెల 14న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్ చవాన్, గోపీకృష్ణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయులకు డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయడంతో పాటు కొత్త పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరా రు. విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయుల సంక్షేమం కీలకమని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ధర్నాలో జిల్లాలోని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు విలాస్, జిల్లా కార్యదర్శి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


