ఆదిలాబాద్‌టౌన్: ప్రస్తుత తరుణంలో జీవనశైలిలో మార్పుతోనే కిడ్నీలను రక్షించుకోవచ్చని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రిమ్స్ డయాలసిస్ కేంద్రంలో గురువారం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడంలో మూత్రపిండాల పాత్ర ఎంతో కీలకమన్నారు. వ్యర్థాలు నిండిపోయి శరీరంలో ఉంటే అవి ప్రాణాపాయానికి దారి తీస్తాయన్నారు. శరీరంలో గుండె, మెదడు, కాలేయంతో పాటు కిడ్నీ కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రస్తుతం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ముఖ్యంగా మధుమేహం, బీపీతో బాధపడుతున్న వారిలో కిడ్నీలు చెడిపోతున్నాయన్నారు. కలుషిత నీరు తాగడం ద్వారా, పెయిన్ కిల్లర్స్ వాడడం ద్వారా కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు తానాజీ జాడే, డాక్టర్ చందు, నెఫ్రాలజిస్ట్ కొండలరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ విఠల్, డయాలసిస్ ఇన్‌చార్జి ప్రేమ్‌దాస్, తదితరులు పాల్గొన్నారు.


