బోథ్: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో బిల్లుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో 473 గ్రామ పంచాయతీలు ఉండగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.20.31 కోట్ల నిధులు మంజూ రు చేసింది. అయితే గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకుంటుందని భావించారు. అయితే ని ధులు విడుదలైన వెంటనే పాత పనులకు సంబంధించిన బిల్లుల అంశం తెరపైకి వచ్చింది. దీంతో అ నేక గ్రామ పంచాయతీల్లో వివాదం నెలకొంటోంది.
పాత బిల్లులు చెల్లించాలి
పాత సర్పంచుల పదవీకాలం 2024, ఫిబ్రవరి 1న ముగిసింది. అప్పటికే సర్పంచులు గ్రామాల్లో పలు పనులను సొంత ఖర్చులతో పూర్తి చేశారు. సర్పంచుల పదవీకాలం ముగిసిన అనంతరం ప్రభుత్వం ప్రత్యేకాఽధికారులతో ప్రత్యేక పాలన అమలు చేసింది. ఆయా గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు పంచాయతీలను అంతగా పట్టించుకోలేదు. దీంతో జీపీల్లో పనుల బాధ్యత కార్యదర్శులపై పడింది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కార్యదర్శులు తమ సొంత డబ్బులను వెచ్చించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రెయినేజీలు, శానిటేషన్, తాగునీటి వంటి పనులు చేపట్టారు. కేంద్రం నుంచి నిధులు రావడంతో తా ము ఖర్చు చేసిన బిల్లులు ఇవ్వాలని కోరుతున్నారు.
మొత్తం బిల్లులు ఇవ్వలేం..
నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే విడుదలైన నిధులను పూర్తిగా పాత బిల్లులకే చెల్లిస్తే గ్రామాల్లో కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేపట్టాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం వచ్చిన నిధుల్లో కొంత బిల్లులు చెల్లిస్తామని, రాబోయే నిధుల్లో మరికొంత చెల్లిస్తామని కొత్త సర్పంచులు పేర్కొంటున్నారు. మరికొన్ని పంచాయతీల్లో ముగ్గురి మధ్య సయోధ్య కుదరుతోంది. ఇక్కడ బిల్లుల విషయంలో ఇబ్బందులు తలెత్తడం లేదు. కాగా కొన్ని గ్రామాల్లో ఈ విషయంపై పాత, కొత్త సర్పంచుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. పాత పనుల బిల్లులు చెల్లించాల్సిందేనని ఒక వర్గం పట్టుబడుతుండగా, ముందు ప్రస్తుత అవసరాలపై ఖర్చు చేయాలని మరో వర్గం వాదిస్తోంది. దీంతో గ్రామపంచాయతీల్లో బిల్లుల వ్యవహారం పెద్ద సమస్యగా మారింది.
రికార్డు ఉంటేనే చెల్లింపు..
గ్రామ పంచాయతీల్లో గతంలో పనిచేసినట్లు ఎంబీ రికార్డు ఉంటే బిల్లుల చెల్లింపులు సులభంగా జరుతున్నాయి. పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగాల్లోని ఇంజినీర్లు పనిచేసినట్లు ఎంబీలు రికార్డు చేశారు. వీటికి బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే గ్రామాల్లో రికార్డు లేకుండా, వ్యాపారుల వద్ద నుంచి తెచ్చిన బిల్లుల విషయంలో కొత్త సర్పంచులు పేచీ పెడుతున్నారు. జిల్లాలో అనేక చోట్ల ఇలాంటి బిల్లుల పంచాయతీ నడుస్తోంది.


