కై లాస్‌నగర్: దేశాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు జనగణనే దిక్సూచిగా నిలుస్తుందని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. భారత జనగణన–2027 నిర్వహణపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జనగణన నుంచి జనకల్యాణం’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించే సమాచారం భవిష్యత్‌లో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆధారమవుతుందన్నారు. ఎక్కడా పొరపాట్లు లేకుండా గణన చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ, ఈ ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని, మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మే 11, 2026 నుంచి జూన్ 9, 2026 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో ఇంటి నిర్మాణం, వసతులు, కుటుంబ యజమాని వివరాలు తదితర 33 అంశాలపై సమాచార సేకరణ ఉంటుందని పేర్కొన్నారు. రెండో దశ ఫిబ్రవరి 2027లో నిర్వహించి మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణించనున్నట్లు వివరించారు. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్ ద్వారా గణన చేపట్టడంతో పాటు, ప్రజలు తమ వివరాలు స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గణన ప్రారంభానికి 15 రోజుల ముందే ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి రానుందన్నారు. హైదరాబాద్ జనాభా గణన విభాగం గణాంక అధికారులు ఆదెపు వినయ్, వై. జంగయ్య హాజరై అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో రవీందర్ రాథోడ్, డీపీవో రమేశ్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


