వేమనపల్లి: వన్యప్రాణులను వేటాడటం నేరమని చెన్నూర్ ఎఫ్‌డీవో సర్వేశ్వర్ హెచ్చరించారు. నీల్వాయి రేంజ్ కల్మలపేట అటవీ సమీప వ్యవసాయ భూముల్లో చుక్కల దుప్పిని హతమార్చిన ప్రదేశాన్ని శుక్రవారం రేంజ్ అధికారి హఫీజొద్దీన్, నీల్వాయి ఎస్సై జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో సబ్ ఇంజినీర్ ఆకాశ్, డిప్యూటీ రేంజ్ అధికారి ప్రమోద్‌కుమార్ సర్పంచ్ ఆవులమర్రి పున్నంతో కలిసి పరిశీలించారు. విద్యుత్ తీగెలు అమర్చి చుక్కల దుప్పిని వేటాడిన పేరగాని రాజ్‌కుమార్, బొద్దున శ్రీకాంత్, హనుమాండ్ల సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలం వద్ద దుప్పి తల, కాళ్లు, తోలు స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ తీగెలు అమర్చటంతో పశువులు, ప్రజలకు ప్రాణాపాయం ఉంటుందని, అలా చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఎఫ్‌బీవో మహిపాల్, బేస్‌క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
బాసర: మండల కేంద్రంలోని బొర్ర గణేశ్‌కాలనీకి చెందిన యువకుడు షిండే అమృత్ (25) వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. షిండే రాజాబాయి–దత్తూరాం పటేల్ దంపతుల రెండో కుమారుడైన అమృత్ హోటల్‌లో పనిచేస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. తండ్రి దత్తూరాం పటేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవనీత్‌రెడ్డి తెలిపారు.


