‘ముసాయిదా’.. తప్పుల తడక
కైలాస్‌నగర్: ముసాయిదా ఓటరు జాబితాలో దొర్లి న తప్పుల సవరణపై ఆదిలాబాద్ మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 1న ప్రకటించిన జాబితాలో పలు వార్డుల్లోని ఓటర్ల వివరాలు తారుమారయ్యాయి. ఒక వార్డులోని ఓటర్ల ను మరో వార్డులోకి చేర్చడంతో గందరగోళ పరిస్థి తి ఏర్పడింది. దీంతో రాజకీయ పార్టీలతో పాటు ఓ టర్ల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బల్దియా అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. పారదర్శక జాబితా రూపకల్పన దిశగా చర్యలు చేపట్టారు. తమకు అందిన అభ్యంతరాలపై వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి కి వెళ్లి విచారణ జరుపుతున్నారు. ఓటర్ల వివరాల ను ప్రత్యక్షంగా సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 12న ఫొటోలతో కూడిన ఓటరు తుది జాబితా ప్రకటించనుండగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వెల్లువలా అభ్యంతరాలు
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రా ష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 1న మున్సిపల్ అధికారులు ముసాయిదా ఓటరు జాబి తా ప్రకటించారు. ఈ జాబితా పూర్తి తప్పుల తడకగా మారింది. ఓటర్ల వార్డులు తారుమారు కావడం, మృతుల పేర్లు, గ్రామీణ ప్రాంత ఓటర్ల పేర్లు జా బితాలో చేర్చడంపై ఆందోళన వ్యక్తమైంది. దీంతో వీటిపై అభ్యంతరాలు స్వీకరించేందుకు అధికారులు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముగ్గురు ఉద్యోగులను నియమించి ఈ నెల 2నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున అభ్యంతరాలు అందుతున్నాయి. తమ ఓట్లు వేరే వార్డులోకి వెళ్లాయని, తమను ఫలానా వార్డులోనే కొనసాగించాలని, త మ వార్డులో కొత్త ఓట్లు భారీగా చేరాయని, గ్రామీ ణ ప్రాంత ఓటర్లను తొలగించాలని, మృతి చెందిన ఓటర్ల వివరాలు కూడా ఉన్నాయని.. వాటిని తీసివేయాలంటూ ఇలా వివిధ కారణాలతో ఫిర్యాదులు, విజ్ఞప్తులు అందుతున్నాయి. ఈ నెల 2నుంచి 9వరకు 308 ఫిర్యాదులు అందాయి. ఈ నెల 2న 6 అభ్యంతరాలు, 3న 59, 4న 44, 5న 151, 6న 20, 7న 14, 8న 10, 9న 4 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని నమోదు చేసుకుంటున్న సిబ్బంది ఆ తర్వాత ఎన్నికల విభాగానికి పంపుతున్నారు.
క్షేత్రస్థాయిలో ప్రత్యేక పరిశీలన
మున్సిపల్ అధికారులకు అందుతున్న ఫిర్యాదుల ను పరిశీలిస్తున్న ఎన్నికల విభాగం సిబ్బంది వాటిని వార్డుల వారీగా విభజిస్తున్నారు. వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పరిశీలన చేస్తున్నారు. ఓటర్లు స్థానికంగానే ఉంటున్నారా? అనేదానిపై ఆరా తీయడంతో పాటు వారు నివాసముండే ఇంటి నంబర్లు, ఓటరు ఎపిక్ కార్డులను పరిశీలించి నమోదు చేసుకుంటున్నారు. మృతి చెందిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇలా క్షే త్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని తిరిగి ఎన్ని కల విభాగంలో అందజేస్తున్నారు. అక్కడి సిబ్బంది వార్డులోని ఓటరు జాబితాలో వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. బల్దియా యంత్రాంగమంతా ప్రస్తుతం ఓటరు జాబితాతోపాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తులో నిమగ్నమైంది. అయితే సమయం తక్కువగా ఉండటంతో పొరపాట్లకు తావులేని పారదర్శక జాబితా అందిస్తారా? లేదా.. పోలింగ్ రోజున ఓటర్లను ఇబ్బందులకు గు రిచేస్తారా? అని ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆశావహుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
చర్యలు చేపడుతున్నాం
ముసాయిదా ఓటరు జాబితాపై ప్రజల నుంచి అందుతున్న అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. వార్డుల వారీగా వివరాలు వార్డు అధికారులకు అందజేస్తున్నాం. వారు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రత్యేక పరిశీలన జరుపుతున్నారు. పొరపాట్లను సవరించి ఎలాంటి తప్పుల్లేని పారదర్శక ఓటరు జాబితాను సిద్ధం చేసేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరంలేదు.
– కళ్యాణ్,
మున్సిపల్ రెవెన్యూ అధికారి


