సోయా కొనుగోళ్లు అంతేనా?
ఇచ్చోడ: జిల్లాలో ఈ ఏడాది సోయా రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సీజన్‌లో అధిక వ ర్షాలతో పంట దెబ్బతిని దిగుబడిపై తీవ్ర ప్రభా వం చూపింది. అరకొరగా చేతికొచ్చిన పంటను మార్కెట్‌లో అమ్ముకునేందుకు ఇబ్బందులు తప్పడం లే దు. అతివృష్టి కారణంగా రంగుమారిన సోయా కొ నుగోలుకు ప్రభుత్వం నిరాకరిస్తుండడంతో యార్డులోనే రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థి తి. కొందరు గత్యంతరం లేక తక్కువ ధరకు ప్రైవేట్‌లో అమ్ముకుని నష్టపోతున్నారు. మరోవైపు అధి కారుల నుంచి స్పష్టత లేకపోవడంతో ఇక సోయా కొనుగోళ్ల కథ కంచికే అన్నట్లుగా తెలుస్తోంది.
అధికారుల నుంచి స్పష్టత కరువు
ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కా రణంగా 80 శాతం పైగా సోయా రంగు మారింది. నాఫెడ్ నిబంధనల ప్రకారం కేవలం మూడు శాతం నాణ్యత ఉన్న వాటినే కొనుగోలు చేసి గోదాంలలో నిల్వ ఉంచడానికి అనుమతి ఇస్తున్నారు. అయితే జిల్లాలో చాలావరకు పంట 10నుంచి 15 శాతం నా ణ్యత ప్రమాణాల్లో ఉంది. ఒకవేళ యార్డుల్లో కొనుగోలు చేసిన సోయా నాణ్యత లేకుంటే సీడబ్లూసీ గోదాం ఇన్‌చార్జీలు తిప్పి పంపిస్తున్నారు. దీంతో జి ల్లావ్యాప్తంగా పక్షం రోజులుగా కొనుగోళ్లను నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి నిబంధనలు సడలిస్తే కానీ కొనుగోళ్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్ అసెంబ్లీలో చర్చకోసం ఇచ్చిన తీర్మానా న్ని రాష్ట్రసర్కారు తిరస్కరించడంతో సోయా కొ ను గోళ్లపై నీలినీడలు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే..
ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక ఆదేశాలు వస్తేనే రంగుమారిన సోయా కొనుగోలు చేస్తాం. వారం క్రితం అక్కడక్కడా కొన్ని కేంద్రాల్లో కొనుగోలు చేసినా నాణ్యత లేదని సీడబ్ల్యూసీ గోదాంల నుంచి వాపస్ పంపించారు. దీంతో తాత్కాలికంగా కొనుగోళ్లను నిలిపివేశాం. –ప్రవీణ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం
జిల్లాలో..
ఈ సీజన్‌లో సోయా సాగు 72వేల ఎకరాలు
దిగుబడి అంచనా 6.08 లక్షల క్వింటాళ్లు
ఇప్పటివరకు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది 1.30 లక్షల క్వింటాళ్లు


