ఏఐతో ‘భవిత’పై ఫోకస్
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఏఐ ఆధారిత బోధన రాష్ట్రంలోనే జిల్లాలో తొలిసారిగా అమలు కలెక్టర్ చొరవతో భవిత సెంటర్‌లో ప్రారంభం
ఆదిలాబాద్‌టౌన్: వైకల్యం శరీరానికే తప్ప మేధస్సుకు కాదు.. వారిని ప్రోత్సహిస్తే ఏ విషయంలోనైనా ముందుకు సాగుతారనే ఉద్దేశ్యంతో కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవ చూపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో తొలిసారిగా మానసిక వైకల్యం కలిగిన పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ (ఏఐ) ద్వారా బోధన జరిగేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి రూ.5లక్షలు కేటాయించారు. వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల ఆవరణలో గల భవిత సెంటర్‌లో ఇటీవల ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఈ బోధనను ప్రారంభించారు. 20 రోజుల్లో వారిలో సామర్థ్యాలు మెరుగుపడటం గమనార్హం. జిల్లాలోని మిగతా భవిత సెంటర్లలో ప్రారంభిస్తే ప్రయోజనం చేకూరనుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్ చొరవపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కలెక్టర్ చొరవతో..
కలెక్టర్ రాజర్షి షా సర్కారు పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో 12 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ ద్వారా సాధారణ విద్యార్థులకు విద్యాబోధన సాగుతుంది. వీరిలాగే వైకల్యం కలిగిన పిల్లల్లోనూ సామర్థ్యాలు మెరుగుపర్చాలని భావించిన కలెక్టర్ ఏఐ ద్వారా వారికి బోధన జరిగేలా చర్యలు చేపట్టారు. గతనెల 16న జిల్లా కేంద్రంలోని భవిత సెంటర్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పాఠశాలలో నలుగురు అంధ విద్యార్థులు, ఎనిమిది మంది సరిగా మాట్లాడటం రానివారు, 12మంది బుద్దిమాంధ్యం కలిగిన పిల్లలు ఉన్నారు. వీరి అవసరాలను బట్టి రూ.5లక్షల నిధులతో 2 ల్యాప్‌టాప్‌లు, ఒక ట్యాబ్, బ్రెయిలీ లిపికి సంబంధించి రీడింగ్ పరికరాలు, స్కానర్లు తదితర వస్తువులను ఏర్పాటు చేశారు. విద్యార్థులు గైర్హాజరు లేకుండా ప్రతిరోజు రావడంతో వారిలో ఆసక్తి పెరిగింది. ఆడుతూ పాడుతూ పాఠాలు వింటున్నారు. కొత్తకొత్త పదాలు నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం వారిలో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడ్డాయి.
బోధన సులువు..
సాధారణ విద్యార్థులకు బోధన చేయడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది బుద్దిమాంధ్యం, వైకల్యం, వివిధ రుగ్మతలతో బాధపడే పిల్లలకు చదువు బోధించాలంటే అంత సులువేమి కాదు. అయినప్పటికీ భవిత రిసోర్స్ సెంటర్‌లో పనిచేసే ఉపాధ్యాయులు కష్టపడి వారికి విద్యనందిస్తున్నారు. సరిగా మాట్లాడలేని వారు బొమ్మలు చూస్తూ, వింటూ నేర్చుకుంటున్నారు. అంధత్వం కలిగిన చిన్నారులు వస్తువులను తాకుతూ కొత్త పదాలను తెలుసుకుంటున్నారు. వీరిందరికీ ప్రత్యేకంగా హెడ్‌ఫోన్‌లను ఏర్పాటు చేయడంతో బోధన సులువుగా మారింది. దీంతో పాటు బ్రెయిలీ లిపిని సైతం ఏర్పాటు చేశారు. పాఠ్యాంశాన్ని స్కాన్ చేస్తే మాటలు, పాటలు పలుకుతాయి. పిల్లలు నేర్చుకున్న తర్వాత కొత్త పదాలను నేర్చుకునేందుకు వీలు కలిగింది. ఒకటికి పది సార్లు రావడంతో వారు మరిచిపోకుండా గుర్తు పెట్టుకుంటున్నారు.
ఏఐ బోధన ఎంతో ఉపయుక్తం
కలెక్టర్ చొరవతో భవిత రిసోర్స్ సెంటర్‌లో ఏఐ ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యబోధన ప్రారంభించడం జరిగింది. గతం కంటే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెరిగాయి. అందరూ ఒకే చోట కూర్చుని ఆసక్తిగా పాఠాలు వింటూ నేర్చుకున్నారు. అంధులు, బుద్దిమాంధ్యం, స్పిచ్‌థెరపీ ద్వారా బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా బోధన అందించడం జరుగుతుంది. ఐఆర్‌పీలకు కొంత ఇబ్బందులు తొలగగా, పిల్లలకు ఎంతో మేలు చేకూరుతుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.
– ఉష్కం తిరుపతి,
విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి


