నెల్లూరును ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం
● మంత్రులు ఆనం, పొంగూరు
నెల్లూరు(బృందావనం): నెల్లూరును ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రంగనాయకులపేటలోని వెంకటమ్మ పేరంటాలు ఆలయంలో రూ.1.5 కోట్లతో మూడంతస్తుల రాజగోపురం, మహా మండపం నిర్మాణ పనులకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమాలను ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటమ్మ పేరంటాలు ఆలయాభివృద్ధి చేసే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు. తొమ్మిది నెలల్లో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. నారాయణ మాట్లాడుతూ కామన్ గుడ్ ఫండ్స్ ద్వారా రూ.1.5 కోట్లు, అలాగే నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో నాలుగు ఆలయాలకు రూ.23.95 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, జిల్లా దేవదాయ శాఖాధికారి కోవూరు జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


