
గాడి తప్పుతున్న విద్యాశాఖ
ఏడేళ్లుగా ఇన్‌చార్జి అధికారులే..!
కొరవడిన పర్యవేక్షణ
ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పలువురు ఉద్యోగులు, టీచర్లు
ఇన్‌చార్జి బాధ్యతల్లోకి ఐటీడీఏ పీవో
ఖుష్బూ గుప్తాపైనే ఆశలు
ఆదిలాబాద్‌టౌన్: విద్యాశాఖ గాడి తప్పుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల ప ట్టింపులేమి వెరసీ ఆ శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏడేళ్లుగా రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వం ఇటీవల ఐఏ ఎస్ అధికారికి ఇన్‌చార్జి డీఈవో బాధ్యతలు అప్పగించింది. ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా విధులు నిర్వహిస్తున్న ఖుష్బూగుప్తాకు ఇప్పటికే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి అదనపు బాధ్యతలు సైతం ఉన్నాయి. నాలుగు కీలక బాధ్యతలు ఉండడంతో విద్యాశాఖపై ఫోకస్ పెట్ట డం లేదని తెలుస్తోంది. ఈనెల 5న బాధ్యతలు స్వీకరించగా, ఇప్పటివరకు కనీసం కార్యాలయాన్ని సైతం సందర్శించకపోవడం గమనార్హం.
ఏడేళ్లుగా ఇన్‌చార్జీలే..
2018 నుంచి జిల్లాకు ఇన్‌చార్జి డీఈవోలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయి. సర్కారు బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేద నే విమర్శలున్నాయి. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, కొందరు గురువులు వి ద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించడం, తోటి ఉపాధ్యాయులతో గొడవలు పడటం, ఇష్టానుసారంగా విధులకు హాజరుకావడం, పాఠశాల నిధులు కాజేయడం, కార్యాలయ ఉద్యోగులు పలువురు అక్రమాలకు పాల్పడటం వంటివి చోటు చేసుకుంటున్నాయి. పర్యవేక్షణ కొరవడడంతోనే ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. 2018లో రెగ్యులర్ డీఈవోగా జనార్దన్ ఉండగా, ఆయనను సరెండ్ చేశారు. ఆ తర్వాత డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రవిందర్ రెడ్డి, నిర్మల్ ఏడీగా పనిచేసిన ప్రణీత ఇన్‌చార్జి డీఈవోలుగా వ్యవహరించారు. వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఏప్రిల్ నుంచి జూలై వరకు ఇన్‌చార్జి డీఈవోగా పనిచేశారు. ఈనెల 1న ఆయనను విధులను తప్పించి ఐటీడీఏ పీవోకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఉట్నూర్‌లోనే బా ధ్యతలు స్వీకరించిన సదరు అధికారి ఇప్పటివరకు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయాన్ని సందర్శించకపోవడం గమనార్హం.
ఉట్నూర్‌కే ఫైల్స్..
జిల్లా విద్యాశాఖకు సంబంధించిన ఫైల్స్‌ను ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు ఉట్నూర్‌కు తీసుకెళ్తున్నా రు. ఐటీడీఏ పీవోగా ఉన్న ఇన్‌చార్జి డీఈవో అక్కడే ఉండడంతో వారి వద్దకే ఫైళ్లను తీసుకెళ్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే విద్యాశాఖ నుంచి విడుదలయ్యే ప్రకటనలు, ఇతర ఉత్తర్వులు, ఫైళ్లపై సంతకాల కోసం తరచూ వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.