
మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం
వి.కోట: మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా శ్రీజ డెయిరీ పనిచేస్తోందని డెయిరీ ఏరియా పీఏబీ ఎగ్జిక్యూటివ్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. మండలంలోని పట్రపల్లి కొత్తూరు గ్రామంలోని డెయిరీ సభ్యులకు ఆదివారం శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పశుసంరక్షణ కిట్లు, పశుగ్రాసం కోసం సీడ్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీజ డెయిరీలో పాలు పోసే సభ్యుల నుంచి బోర్డు డైరెక్టర్ వరకు అందరూ మహిళలే ఉన్నారని తెలిపారు. ఈ డెయిరీ పాల ఉత్పత్తిలో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందన్నారు. మహిళల సాధికారత కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు. శ్రీజ మహిళ పాల యజమానులకు వాళ్ల అర్హతను బట్టి 2024–25 ఆర్థిక సంవత్సరంలో బోనస్‌గా లీటర్‌కు 0.60 పైసలు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డెయిరీ ఏరియా సూపర్‌వైజర్స్ నాగరాజ్, కిషోర్‌రెడ్డి, పాలమిత్ర నారాయణ స్వామి పాల్గొన్నారు.
పుంగనూరు: మున్సిపాలిటీ పరిధిలోని కట్టక్రిందపాళెం, చింతలవీధి, నగిరివీధి ప్రాంతాల్లో సోమవారం బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్–6 పేరుతో అరకొరగా పథకాలు అమలుచేస్తూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఈ క్రమంలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన మంచిని ప్నజలకు వివరిస్తామని వెల్లడించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.