
అట్టహాసంగా దుర్యోధన వధ
ఐరాల: మండలంలోని మద్దిపట్లపల్లెలో శ్రీద్రౌపదీ సమేత ధర్మరాజుల ఆలయ మహా భారత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దుర్యోధన వధ ఘట్టం అట్టహాసంగా జరిగింది. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహంతోపాటు శ్రీకృష్ణ, భీమ, అర్జున, నకుల, సహదేవ ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్యోధనుడి మట్టి ప్రతిమ చూపరులను ఆకట్టుకుంది. మధ్యాహ్నం దుర్యోధన వధ ఘట్టాన్ని కళాకారులు రక్తికట్టించారు. ముందుగా గంగమడుగులో దాక్కొని ఉన్న దుర్యోధనుడిని భీమసేనుడు లాక్కొచ్చి చేసే యుద్ధ సన్నివేశం అలరించింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్యోధనుడి ప్రతిమ వద్ద సాగిన భీమ, దుర్యోధన వేషధారులు యుద్ధ సన్నివేశాలు కట్టిపడేశాయి. అదేవిధంగా దుర్యోధునుడు ఆలపించిన పద్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి. అనంతరం భీముని వేషధారి దుర్యోధనుడిని వధించడం చూపరులను ఎంతో ఆకట్టుకుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసిన జనంతో ఆలయం వద్ద సందడి నెలకొంది.