
గిరిజనేతరుల చేతిలో వేల ఎకరాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అటవీ భూములు సా గు చేస్తున్న వేలాది గిరిజనేతరులు తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా బీసీ, ఎస్సీలు అటవీ భూముల ఆధారంగానే జీవి స్తూ సాగు చేసుకుంటున్నారు. గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్(అటవీ హక్కుల గుర్తింపు) కింద ప ట్టాలు ఇచ్చారు. కానీ గిరిజనేతరులకు అవకాశం లే దు. దీంతో ఏటా సీజన్‌లో ఆ భూముల్లో విత్తనాలు వేసే సమయంలో ఆక్రమణదారులు, అటవీ అధికా రుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల తిరిగి స్వాధీనం చేసుకుని మొక్కలు నా టుతున్నారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్తులను అటవీ అధికారులు సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు పాదయాత్ర చేపట్టగా, మధ్యలోనే పోలీసులు అడ్డుకుని తీసుకొచ్చారు.
బీసీ, ఎస్సీలు అధికం
అటవీ భూములను గిరిజనులతోపాటు బీసీ, ఎస్సీ ఇతర వర్గాలు వేలాది మంది సాగు చేస్తున్నారు. వీరికి సైతం పట్టాలు ఇవ్వాలని డిమాండ్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం పక్కన పెట్టింది. మూడేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 1.50లక్షల మంది గిరిజన రైతులకు 4.05లక్షల ఎకరాల్లో హక్కులు కల్పించారు. చట్టం ప్రకారం గిరిజనులకు మాత్రమే హక్కులు ఉన్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాల్లోనూ గిరిజనేతరులు సాగులో ఉన్నారు. రిజర్వు ఫారెస్టుతోపాటు పులుల సంరక్షణ కేంద్రమైన కవ్వాల్ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా 1.29లక్షల ఎకరాలు ఆక్రమణలో ఉంది. గిరిజనేతరులతోపాటు కొన్ని చోట్ల గిరిజనులు సైతం కొత్తగా ఆక్రమణలకు పాల్పడుతుండడంతో అడవుల సంరక్షణ మరింత ఇబ్బందిగా మారిందని అధికారులు వాపోతున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే..
నిజాం కాలం నుంచే అటవీ ఆక్రమణలు ఉన్నప్పటికీ గత 20ఏళ్లలో ఈ ఆక్రమణలు తీవ్రంగా పెరిగాయి. పత్తి సాగు మొదలైనప్పటి నుంచి గిరిజనులతోపాటు గిరిజనేతరులు సైతం పెద్ద ఎత్తున చెట్లను నరికి సాగులోకి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది సిబ్బంది అవినీతితో ఇష్టారీతిన ఆక్రమణలు జరిగాయి. మరికొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల నిర్లక్ష్యం, తదితర కారణాలతోనూ రిజర్వు ఫారెస్టుల్లో సాగు మొదలైంది. ఆ భూములే తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే సామాజిక సమస్యగా మారింది.
దిందాలో ఒక్కొక్కొరు 40ఎకరాల వరకు..
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బందెపల్లి, దిందాలో పరిధిలో ఒక్కో కుటుంబం ఎకరం నుంచి 42ఎకరాల వరకు ఆక్రమించారు. ఇందులో పది నుంచి 30ఎకరాల వరకు సాగులో ఉన్నారు. ఇక్కడ 530ఎకరాల్లో గిరిజనులకు పట్టాలు ఇచ్చారు. రిజర్వు ఫారెస్టులో 2600ఎకరాలు ఆక్రమణలో ఉంది. అయితే 600ఎకరాలను సాగుదారులకు వదిలేశారు. మిగతాది గిరిజనేతరుల నుంచి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా వివాదం రాజుకుంటోంది.