
టీచర్లకు టీఎల్‌ఎం మేళా
● ఈనెల 18లోపు మండల, 20లోపు జిల్లాస్థాయిల్లో ఏర్పాటు
● ఉత్తర్వులు జారీ చేసిన ‘సమగ్ర శిక్ష’
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో టీచర్లు ఏవిధంగా పాఠాలు బోధిస్తున్నారో అనే అంశాలపై అభ్యసన సామగ్రి (టీచింగ్ లర్నింగ్ మెటీరియల్) మేళా నిర్వహించేందుకు వి ద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇది విద్యార్థులు నేర్చుకునే ప్రక్రియను సులభతరం చేయడానికి ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనా సామగ్రిని ప్రదర్శించే కార్యక్రమం. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో తక్కువ ఖర్చుతో సులభంగా తయారు చేయగల బోధనా ఉపకరణాలను ప్రదర్శిస్తారు. ఈ మేళాలో ఉపాధ్యాయులు తమ సృజనాత్మకత, నైపుణ్యాలను చాటుతారు. అలాగే ఉపాధ్యాయులు కొత్త ఆలోచనలు నేర్చుకోవడానికి, పంచుకోవడాని కి అవకాశం ఉంటుంది. ఆదివారం తెలంగాణ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు టీఎల్‌ఎం మేళాలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతీ పాఠశాల నుంచి విద్యార్థులకు బోధించే టీఎల్‌ఎంను మేళాలో ప్రదర్శించాలి. ఈనెల 18లోగా మండల స్థాయిలో 20లోగా జిల్లాస్థాయిలో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ మండలం నుంచి 10 ఉత్తమ ప్ర దర్శనలు జిల్లా స్థాయికి ఎంపిక చేయనున్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వాటిని రాష్ట్రస్థాయికి పంపించనున్నారు. గత విద్యా సంవత్సరం నుంచి ఈ టీఎల్‌ఎం మేళాను విద్యా శాఖ నిర్వహిస్తుంది. జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. ఈ మేళాతో సర్కారు బడుల్లో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు దోహద పడనుంది. కాగా సోమవారం ఈ టీఎల్‌ఎం మేళా నిర్వహణకు సంబంధించి జూమ్ మీటింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
తక్కువ ఖర్చుతో బోధన సామగ్రి
ఉపాధ్యాయులు తక్కువ ఖర్చుతో తయారు చేసిన బోధన సామగ్రితో మేళాలో ప్రదర్శనలు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యార్థులు తయారు చేసిన నమూనాలు చార్ట్‌లు, గేమ్స్, పటా లు, వివిధ అంశాలకు సంబంధించి మేళాలో ప్రదర్శించాలి. భాషా, అక్షరమాల, పదాల ద్వారా ఏర్ప డే చిత్రాలు, గణితం, కొలతలు, పర్యావరణం, జంతువులు, పక్షులు, సైన్స్‌కు సంబంధించిన అంశాల ను ఇందులో ప్రదర్శించనున్నారు. ఈ మేళాతో ఆ యా పాఠశాలల ఉపాధ్యాయులు ఏవిధంగా విద్యాబోధన చేస్తున్నారనే అంశాలు తెలియనున్నాయి. కొత్త అంశాలను ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలల్లో అమలు చేసే అవకాశం ఉంది. అయితే జిల్లా స్థాయిలో నిర్వహించే మేళా కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మేళా నిర్వహణ, భోజనం ఖర్చులను సమకూర్చనుంది.